నూతన నటీనటులను ప్రోత్సహిస్తూ కేఏ ప్రొడక్షన్స్ పతాకంపై కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్న చిత్రం ‘తిమ్మరాజుపల్లి టీవీ’. సాయితేజ్, వేద జలంధర్ హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. ముని దర్శకుడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈ సినిమా మంచి సమ్మర్ వెకేషన్‌లా అనిపిస్తుందని, తిమ్మరాజుపల్లి అనే ఊరిలో జరిగిన సంఘటనల నేపథ్యంలో వినోదం, థ్రిల్లింగ్ అంశాలతో మెప్పిస్తుందని, చిన్న బడ్జెట్లో ఇంత క్వాలిటీగా సినిమా చేయొచ్చా అని అందరూ ఆశ్చర్యపోతారని కిరణ్ అబ్బవరం అన్నారు. చిన్న చిత్రాల్లో ఈ సినిమా ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేయబోతున్నదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామీణ నేపథ్యంలో ఆహ్లాదభరిత కథాంశంతో అందరికి నచ్చే చిత్రమిదని దర్శకుడు వి.మునిరాజు అన్నారు. కొత్తవారైనా నటీనటులందరూ అద్భుతమైన పర్ఫార్మెన్స్ కనబరిచారని ఈటీవీ విన్ బిజినెస్హెడ్ సాయికృష్ణ ప్రశంసించారు.