‘ ‘క’ కథ కిరణ్ అబ్బవరం ద్వారానే నా దగ్గరకు వచ్చింది. వినగానే కంటెంట్ కొత్తగా అనిపించింది. స్క్రిప్ట్ ఈ సినిమాకు ప్రధానబలం. దర్శకులు సుజీత్, సందీప్ బాగా రాసుకున్నారు. అంతకంటే బాగా తీశారు. విడుదలకు ముందే సినిమాపై మంచి బజ్ వచ్చింది. మా టీమ్‌కు మంచి అవకాశాలు కూడా వస్తున్నాయ్. నిర్మాతగా నాకు సంతృప్తినిస్తున్న విషయం ఇది.’ అన్నారు నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డి. ఆయన నిర్మించిన చిత్రం ‘క’. కిరణ్ అబ్బవరం కథానాయకుడు. సుజీత్, సందీప్ దర్శకులు. ఈ నెల 31న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డి విలేకరులతో ముచ్చటించారు. ‘ ‘క’ కోసం కిరణ్ అబ్బవరం చాలా శ్రమించాడు. మే నెలలో డబుల్ కాల్షీట్ వర్క్ చేశాడు. ఉదయం 5గంటలకు సెట్‌కి వచ్చేవాడు. రాత్రి 12 వరకూ షూటింగ్ చేసేవాడు. మళ్లీ ఉదయం 5గంటలకు లొకేషన్లో ఉండేవాడు.
డైరెక్టర్లు కూడా ఎక్కడా రాజీ పడలేదు. ప్రతి షాట్ రిచ్‌గా ఉండాలని శ్రమించారు. చివరి నిమిషం వరకూ సినిమాకోసం కష్టపడ్డారు. దాంతో నిర్మాతగా నేను పెద్ద టెన్షన్ ఫీలవ్వలేదు. ఇటీవలే అవుట్‌పుట్ చూశాను. చాలా బాగా వచ్చింది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా చేయొచ్చు. రెండు తెలుగురాష్ర్టాల్లో 350 థియేటర్లకు పైగా సినిమాను విడుదల చేస్తున్నాం. ఒకేసారి అన్ని భాషల్లో విడుదల చేయలేకపోతున్నామనే బాధ లేదు. ఈ సినిమా ఎప్పుడు ఏ భాషలో విడుదలైన ‘కాంతార’ లాగా బ్లాక్‌బస్టర్ అవుతుందని నా నమ్మకం.’ అని చెప్పారు. ప్రస్తుతం శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ‘సారంగపాణి జాతకం’ సినిమాకు కో ప్రొడ్యూసర్‌గా చేస్తున్నానని, మా సంస్థ నుంచి కొత్త ప్రాజెక్ట్‌ని జనవరిలో ఫైనల్ చేస్తానని గోపాలకృష్ణరెడ్డి తెలిపారు.