Kiran Abbavaram | తాను నటుడిని కాకపోయి ఉంటే పాలిటిక్స్‌లోకి వెళ్లేవాడినని తెలిపాడు యువ నటుడు కిరణ్ అబ్బవరం. ‘క’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కిరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘దిల్ రుబా’ (Dilruba). ఈ సినిమాకి విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తుండగా.. రవి, జోజో, జోస్, రాకేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. రుక్సర్ థిల్లాన్ కథానాయికగా నటిస్తుండగా.. మార్చి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌కి సంబంధించి వరుస ఇంటర్వ్యూలలో పాల్గోంటున్నాడు కిరణ్. అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తన జీవితంలోని ఆసక్తికర విషయాలను కూడా కిరణ్ తాజాగా పంచుకున్నాడు.
సినిమాలకు రాకముందు జీవితంలో ఎదోకటి పెద్దగా సాధించాలనే కోరిక ఎప్పుడు ఉండేది. అందులో భాగంగానే హీరో అవ్వాలి అనుకున్నాను. అయితే నాకు రాజకీయాలు అంటే చాలా ఇష్టం. రాయాలసీమకి చెందిన వ్యక్తిగా రాజకీయాలను చిన్ననాటి నుంచి దగ్గరిగా చూశాను. ఒకవేళ నేను సినిమా హీరో కాకపోయి ఉంటే ఖచ్చితంగా రాజకీయాల్లోకి వెళ్లేవాడిని. మంచి చెడుని పక్కనపెట్టి ప్రజలతో కలవడం నాకు ఇష్టం. దాని వల్లనే నాకు రాజకీయాలపై ఆసక్తి పెరిగింది. అలాగే భవిష్యత్తులో నేను వ్యాపార రంగంలో కూడా అడుగు పెట్టాలని ప్లాన్ చేస్తున్నాను. ప్రత్యేకంగా, రాయలసీమ స్టైల్లోని ఆహారాన్ని అందరికీ అందించాలని కోరుకుంటున్నా. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పుడు చేస్తున్నాను, త్వరలోనే దాన్ని ప్రకటించనున్నాను అని కిరణ్ అబ్బవరం తెలిపారు.