‘నేను మద్రాస్ ఐఐటీలో చదువుకుంటున్న టైంలోనే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశా. వాటికి మంచి పేరొచ్చింది. ఆ తర్వాత ఉద్యోగాన్ని వదిలేసి సినిమా మీద పాషన్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టా.’ అన్నారు జైన్స్ నాని. ఆయన దర్శకుడిగా పరిచయమవుతూ కిరణ్ అబ్బవరంతో రూపొందించిన తాజా చిత్రం ‘కె-ర్యాంప్’. ఈ నెల 18న విడుదలకానుంది.
ఈ సందర్భంగా సోమవారం జైన్స్ నాని పాత్రికేయులతో ముచ్చటించారు. సినిమాలో హీరో పేరు కుమార్ అని, ఆయన పాత్ర స్వభావానికి అనుగుణంగా ‘కె-ర్యాంప్’ అనే టైటిల్ పెట్టామని చెప్పారు. ‘ఈ సినిమా ట్రైలర్లో కొన్ని మాటలు ఇబ్బందిగా అనిపించవొచ్చు. యూత్‌ని అట్రాక్ట్ చేసే ప్రయత్నంలో ట్రైలర్ కట్ చేశాం. కానీ పక్కాగా ఫ్యామిలీస్ చూడాల్సిన సినిమా. అందరికీ కనెక్ట్ అయ్యే అంశాలుంటాయి. వందశాతం వినోదభరితంగా ఉంటుంది.
మంచి కథతో కూడిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇది.’ అని జైన్స్ నాని పేర్కొన్నారు. విజువల్ బ్యూటీతో పాటు కథకు ప్రెష్ఫీల్ తీసుకురావాలనే ఉద్దేశ్యంతో కేరళ బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకున్నామని ఆయన అన్నారు. ‘సినిమా మొదలైన కొద్దిసేపటికే కథ కేరళకు షిఫ్ట్ అవుతుంది. అక్కడ ఓ అద్భుతమైన కాలేజ్ లొకేషన్లో షూటింగ్ చేశాం. సినిమాలో మూడు పాటలు మాత్రమే ఉంటాయి. కథను డిస్టర్బ్ చేయొద్దని ఎక్కువ పాటలు పెట్టలేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా నిలుస్తుంది. ఈ దీపావళికి నవ్వుల టపాసులతో ‘కె-ర్యాంప్’ అలరిస్తుంది’ అని జైన్స్ నాని తెలిపారు.