“క’ సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. థియేటర్లో ప్రేక్షకులు స్టాండింగ్ ఓవేషన్ ఇస్తున్నారు. ఈ కథ అనుకున్నప్పుడు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయపడ్డాం. కానీ అన్ని వర్గాల వారు ఈ కథకు కనెక్ట్ అయ్యారు’ అన్నారు దర్శకద్వయం సుజీత్, సందీప్. వీరిద్దరి దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటించిన పీరియాడిక్ థ్రిల్లర్ ‘క’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సుజీత్ మాట్లాడుతూ ‘మేమిద్దరం అన్నదమ్ములం. ఇండస్ట్రీలో మాకు ఎలాంటి పరిచయాలు లేవు. అయితే కథా రచన మీద ఇద్దరికీ ఆసక్తి ఉండేది. ప్రేక్షకులకు ఓ యూనిక్ పాయింట్‌తో కథ చెప్పాలనే ఉద్దేశంతో ‘క’ స్క్రిప్ట్ సిద్ధం చేశాం. ఈ కథను పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో చెబితే మరింత ఎక్సైటింగ్‌గా ఉంటుందని భావించాం. మధ్యాహ్నమే చీకటి పడటం అనేది తెలంగాణలోని ఓ గ్రామంలో జరుగుతుందని చదివాం. ఆ పాయింట్‌ను కృష్ణగిరి అనే గ్రామానికి అడాప్ట్ చేశాం. ఈ కథ విన్న ప్రతి ఒక్కరు యూనిక్ పాయింట్ అని మెచ్చుకున్నారు. దాంతో సినిమా విజయంపై నమ్మకం పెరిగింది’ అన్నారు. సందీప్ మాట్లాడుతూ ‘ఒకప్పుడు థియేటర్స్ దగ్గర హౌస్‌ఫుల్ బోర్డులు కనపడేవి. ఇప్పుడు మా సినిమాకు అలా హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించడం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో కూడా మేము వినూత్న కథా చిత్రాలను తెరకెక్కిస్తాం. ఇంటర్నేషనల్ రేంజ్ ఉన్న ఐడియాస్తో ఈ సినిమాలు తీయాలనుకుంటున్నాం’ అని చెప్పారు.