కిరణ్ అబ్బవరం, రుక్సర్ థిల్లాన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘దిల్ రూబా’. విశ్వకరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి 14న ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ‘హే జింగిలి..’ అంటూ సాగే రెండో గీతాన్ని విడుదల చేశారు. ‘హే నా జింగిలి.. నా జిందగీ నిండుగా చల్లావే రంగులే.. నా సింగిలూ లైఫ్‌నే తిప్పావు రింగులా..’ అంటూ ఈ పాట సాగింది.
దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ పాట చాలా బాగా వచ్చింది. తొలిసారి ప్రేమలో పడ్డ అబ్బాయి కింగ్‌లా ఫీలవుతాడు. అది విఫలమై రెండోసారి ప్రేమలో పడ్డప్పుడు అతనిలో ఓ భయం మొదలవుతుంది. ఈ నేపథ్యంలో వచ్చే పాట ఇది. భాస్కరభట్ల మంచి సాహిత్యాన్ని అందించారు’ అన్నారు. తన సినిమాలన్నింటిలో ఇది చాలా పవర్ఫుల్ పాత్ర అని, మ్యూజికల్, యాక్షన్ ఎంటర్టైనర్గా మెప్పిస్తుందని హీరో కిరణ్ అబ్బవరం పేర్కొన్నారు.
ఈ సినిమాకు ఆయువుపట్టులాంటి పాట ఇదని, చక్కటి భావాలతో ఆకట్టుకుంటుందని గీత రచయిత భాస్కరభట్ల తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సామ్ సీఎస్, నిర్మాతలు: రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ, రచన-దర్శకత్వం: విశ్వ కరుణ్.