‘కింగ్డమ్’ చిత్రానికి వస్తున్న ఆదరణ మాటల్లో చెప్పలేనంత ఆనందాన్నిస్తున్నది. యూఎస్ ప్రీమియర్ల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. చాలా మంది ఫోన్ చేసి “అన్నా మనం హిట్ కొట్టినం’ అంటూ ఎమోషనల్‌గా ఫీలవుతున్నారు. మీ అందరి ప్రేమవల్లే ఈ విజయం సాధ్యమైంది’ అన్నారు అగ్ర హీరో విజయ్ దేవరకొండ. ఆయన కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘కింగ్డమ్’ గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో చిత్రబృందం తమ ఆనందాన్ని పంచుకుంది.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. వెంకన్నస్వామి ఆశీస్సులు, అభిమానుల ప్రేమ వల్లే ఇదంతా సాధ్యమైందని, విజయాన్ని ప్రేక్షకుల మధ్య సెలబ్రేట్ చేసుకుంటానని, త్వరలో తెలుగుతో పాటు యూఎస్‌లో ఉన్న ప్రేక్షకుల్ని కూడా కలుస్తానని అన్నారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ ‘అనుకున్న విధంగానే సినిమాకు మంచి స్పందన లభిస్తున్నది.
ఈ చిత్రాన్ని సాంకేతికంగా హాలీవుడ్ స్థాయిలో తీశాం. విజయ్ దేవరకొండ అభిమానులు కోరుకున్నట్లు ఈ సినిమాతో ఆయన హిట్ కొట్టడం ఆనందంగా ఉంది’ అని చెప్పారు. విజయ్ గెలిస్తే తాను గెలిచినట్లేనని, సొంతంగా వచ్చి ఏదో సాధించాలనుకునే ఎందరికో విజయ్ స్ఫూర్తినిస్తున్నారని నటుడు సత్యదేవ్ ఆనందం వ్యక్తం చేశారు.