‘యుద్ధంలోకి దిగామంటే అన్నింటికి సిద్ధంగా ఉండాలి. అందుకే నేనెప్పుడూ ఫిట్‌గా ఉంటూ నటుడిగా ఏ సవాలునైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉంటా. ప్రతీ సినిమాకు ప్రాణం పెట్టి పనిచేస్తా’ అన్నారు అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ. ఆయన తాజా చిత్రం ‘కింగ్డమ్’ నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయ్ దేవరకొండ మాట్లాడారు.
గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా కూల్‌గా మాట్లాడుతున్నారనే ప్రశ్నకు విజయ్ దేవరకొండ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. తాను ఎవరి కోసమో మారనని, మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడతానని చెప్పారు. సోషల్‌మీడియాలో కొందరు ఆయనపై చేసే వ్యతిరేక ప్రచారం గురించి స్పందించాలని కోరగా ‘నేను కేవలం ప్రేమను పంచడం గురించే ఆలోచిస్తా. ద్వేషం మీద దృష్టిపెట్టేంత తీరిక లేదు’ అన్నారు. ‘కింగ్డమ్’ సినిమాలో యాక్షన్ అన్నది కేవలం ఓ ఎలిమెంట్ మాత్రమేనని, కథ మొత్తం కట్టిపడేసే భావోద్వేగాలతో సాగుతుందని తెలిపారు. సినిమా మొదలైన రెండు నిమిషాలకే ప్రేక్షకులు ‘కింగ్డమ్’ ప్రపంచంలో లీనమైపోతారని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.
నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ ‘సినిమాకు అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. విజయంపై పూర్తి ధీమాతో ఉన్నాం. ఇది పూర్తిస్థాయి యాక్షన్ సినిమా కాదు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తనశైలి ఎమోషన్స్‌తో రూపొందించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా. ఎక్కువగా రియల్ లోకేషన్స్‌లో షూట్ చేశాం’ అన్నారు. ఈ సినిమాలో తాను మధు అనే పాత్రలో కనిపిస్తానని, ఎంతో ఛాలెంజింగ్ రోల్ అని కథానాయిక భాగ్యశ్రీ బోర్సే చెప్పింది. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవిచందర్, ఆర్ట్: అవినాష్ కొల్లా, సమర్పణ: శ్రీకర స్టూడియోస్, దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి.