Kiara Advani | పైకి కనిపించేంత అందంగా సినిమా తారల జీవితాలుండవు అనేది దగ్గరగా చూసిన వారికే తెలుస్తుంది. ఒక్కసారి సినిమాకు సైన్ చేశాక.. పారితోషికం అందుకున్నాక.. ఇక ఆ సినిమాకోసం ఎంతైనా కష్టపడాల్సిందే. పాత్రలో ప్రాణం పోసేందుకు ఎంతకైనా తెగించాల్సిందే. అందులో హీరోయిన్లేం మినహాయింపు కాదు. గర్భం దాల్చి కూడా యాక్షన్ సన్నివేశాల్లో నటించిన కథానాయికలు ఉన్నారు. అందుకు ఉదాహరణే దీపికా పదుకొణ్, అలియాభట్. నిండు గర్భంతో సినిమా ప్రమోషన్స్‌కు కూడా వారు హాజరైన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారినే అనుసరిస్తున్నది మరో బాలీవుడ్ భామ కియారా అద్వానీ. ప్రస్తుతం కైరా గర్భవతి. కానీ విశ్రాంతి తీసుకునే పరిస్థితి లేదు. ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ‘వార్ 2’ కాగా, రెండోది కన్నడ సినిమా ‘టాక్సిక్’. రెండూ భారీ మాస్ సినిమాలే.
రెండింటిలో ఆమె యాక్షన్ సీన్స్‌లో నటించాల్సివుంది. ఈ రెండు సినిమాల్లోని తన పార్ట్‌ని పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా ప్రస్తుతం ఆమెపై ఉంది. అందుకే.. గర్భం దాల్చి కూడా షూటింగుల్లో పాల్గొంటున్నది కియారా. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ ‘ఇది చాలా సెన్సిటీవ్ ఇష్యూ. కానీ తప్పదు. నా ఒక్కదాని కోసం సినిమా ఆగదు కదా. ఇది కోట్లతో ముడిపడ్డ విషయం. అందుకే షూటింగ్ చేస్తున్నా. కానీ నా నిర్మాతలు నన్ను పసిపాపలా చూసుకుంటున్నారు. యాక్షన్ సీన్స్‌లో కూడా నాకు ఇబ్బంది లేకుండా ప్లాన్ చేస్తున్నారు. సెట్లో ఓ డాక్టర్.. ఓ ఆంబులెన్స్.. ఎమర్జెన్సీ చికిత్సకు అవసరమైన సరంజామా.. ఇవన్నీ నాకోసం ఏర్పాటు చేశారు. అందుకే భయం లేకుండా షూటింగ్లో పాల్గొంటున్నా. ఈ విషయంలో నా నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేకపోతున్నా..’ అంటూ ఆనందం వెలిబుచ్చారు కియారా అద్వానీ.