PM Modi | తమిళ సినీ నటి, భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఖుష్బూ సుందర్, ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు సుందర్ సి.. న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తమ కుమార్తె అవంతిక త్వరలోనే శ్రవణ్ శ్రీనివాసన్ అనే యువకుడితో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న తరుణంలో, ఈ శుభకార్యానికి హాజరై వధూవరులను ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ వారు ప్రధానమంత్రికి వివాహ పత్రికను అందజేసి ప్రత్యేకంగా ఆహ్వానించారు.
ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను ఖుష్బూ సుందర్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఖుష్బూ సుందర్ ప్రస్తుతం బీజేపీలో చురుకైన పాత్ర పోషిస్తుండటంతో, వారు ప్రత్యేకంగా ఢిల్లీకి వెళ్లి మరీ దేశ ప్రధానిని పెళ్లికి ఆహ్వానించడం ఇప్పుడు అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సినీ పరిశ్రమలోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతుండటంతో అభిమానులు, పలువురు ప్రముఖులు అవంతిక-శ్రవణ్‌ల వివాహ వేడుకకు ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.