Khaidhi movie | తమిళ హీరో కార్తీ తెలుగులోను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వైవిధ్య భరిత కథలను ఎంచుకుంటూ సినీరంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటున్నాడు. కార్తీ నటించిన సినిమాలు ఇక్కడ కూడా మంచి కలెక్షన్లను రాబట్టుతాయి. ఈయన స్పీచ్‌లు గాని, సినిమా ప్రమోషన్స్‌లో గాని తెలుగులోనే మాట్లాడటంతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఇక చినబాబు, దేవ్ వంటి వరుస ఫ్లాపులతో నిరాశలలో ఉన్న సమయంలో ఖైదీ సినిమా కార్తీకు మంచి బ్రేక్ ఇచ్చింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్ త్వరలోనే తెరకెక్కనున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.
భాషతో సంబంధంలేకుండా అందరి దృష్టినీ ఆకర్షించింది ఖైదీ చిత్రం. సినిమా విడుదల తర్వాత ఖైదీ స్టోరీ నాదంటూ ఒక వ్యక్తి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి క్లియరెన్స్ వచ్చిందట. ఈ కథ లోకేష్ కనగరాజ్‌దే అని కోర్టు తీర్పునిచ్చింది. ఖైదీ సినిమా సక్సెస్ మీట్లోనే ఈ చిత్రానికి సీక్వెల్ ఉండనుందని మేకర్స్ అప్పట్లోనే వెల్లడించారు. తాజాగా ఈ చిత్రానికి క్లియరెన్స్ రావడంతో చిత్ర బృందం త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం లోకేష్ కనగరాజు విక్రమ్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో విలక్షన నటుడు కమల్ హాసన్ హీరోగా నటిస్తున్నాడు. ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.