KGF -2 Poster | ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా తమ తమ సినిమాలకు సంబంధించిన పోస్టర్స్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఈ క్రమంలోనే పాన్ ఇండియా సినిమా కేజీఎఫ్ చాప్టర్- 2కి సంబంధించిన పోస్టర్ కూడా విడుదలైంది. ఈ సినిమాలో లేడీస్ డామినేషన్ ఎక్కువగా ఉండబోతుందని పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. ఒకరు ఇద్దరు కాదు దాదాపు అరడజను మంది నటీమణులు ఇందులో కనిపిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ నుంచి మొదలు పెట్టి శ్రీనిధి శెట్టి వరకు చాలా మంది కేజిఎఫ్ సీక్వెల్ లో కనిపిస్తున్నారు. వాళ్లందరికీ ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలు ఇచ్చాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.
తాజాగా విడుదలైన పోస్టర్లో హీరోయిన్ శ్రీనిధి శెట్టితో పాటు మరో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళందరిని చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఇందులో ఇందిరా గాంధీ పాత్రలో బాలీవుడ్ మాజీ హీరోయిన్ రవీనా టాండన్ నటిస్తోంది. మరోవైపు సీనియర్ హీరోయిన్ ఈశ్వరి రావు, రూపా రాయప్ప, మాళవిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అందరికీ సంబంధించిన ఓకే పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదల కానుంది.
దీనికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలను మార్చి చివరి వారం నుంచి మొదలు పెట్టనున్నారు దర్శక నిర్మాతలు. మార్చి 27 సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకు కేజీఎఫ్ 2 ట్రైలర్ విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం కూడా వచ్చింది. తెలుగులో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక్కడ ఈ సినిమా రైట్స్ 60 కోట్లకు పైగా చెల్లించి దిల్ రాజు తీసుకున్నట్లు తెలుస్తోంది.