The Kerala Story 2 | ‘ది కేరళ స్టోరీ 2: గోస్ బియాండ్’ సినిమాపై కేరళ హైకోర్టులో మరోసారి వివాదం మొదలైంది. ఈ చిత్రానికి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికేషన్‌ను సవాల్ చేస్తూ, టైటిల్ నుంచి ‘కేరళ’ అనే పదాన్ని తొలగించాలని దాఖలైన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సినిమా నిర్మాత విపుల్ అమృత్లాల్ షాకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ సినిమా కేరళను తప్పుగా చూపిస్తోందని, మతాల మధ్య సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉందని కొచ్చికి చెందిన యోహాన్ జార్జ్ పిటిషన్ వేశారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 196, 197, 299 ప్రకారం నిర్మాత నేరాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. మతం, ప్రాంతం, భాష పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టడం, జాతీయ సమగ్రతకు భంగం కలిగించడం, మత మనోభావాలను కించపరచడం లాంటివి సినిమా చేస్తోందని పిటిషన్లో పేర్కొన్నారు.
అయితే ఈ పిటిషన్‌ని గురువారం విచారించిన జస్టిస్ పీవీ కున్హికృష్ణన్, సినిమా ఇప్పటికే థియేటర్లలో విడుదలై చాలా మంది చూసిన తర్వాత ఈ పిటిషన్‌కు అర్థం ఉందా అని ప్రశ్నించారు. అయితే మే 1 నుంచి జీ5 ఓటీటీలో సినిమా స్ట్రీమ్ అవుతోందని, అందుకే ఈ వివాదం ఇంకా కొనసాగుతుందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. దీంతో కోర్టు కేసును విచారణకు స్వీకరించింది. సినిమాను ప్రసారం చేస్తున్న జీ ఎంటర్టైన్మెంట్ను కూడా కేసులో చేర్చాలని పిటిషనర్ కోరగా.. కోర్టు పరిశీలించినట్లు తెలుస్తుంది.
ఇదివరకు ఫిబ్రవరి 26న జస్టిస్ బేచు కురియన్ థామస్ సింగిల్ బెంచ్ సినిమా విడుదలను రెండు వారాల పాటు నిలిపివేస్తూ సీబీఎఫ్సీ సర్టిఫికేషన్‌ను మళ్లీ సమీక్షించాలని ఆదేశించింది. కానీ నిర్మాతలు వెంటనే డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. ఫిబ్రవరి 27న జస్టిస్ సుష్రుత్ అరవింద్ ధర్మాధికారి, జస్టిస్ పీవీ బాలకృష్ణన్‌ల ధర్మాసనం సింగిల్ జడ్జి ఆదేశాలపై స్టే ఇచ్చింది. దాంతో అదే రోజు మధ్యాహ్నం ‘ది కేరళ స్టోరీ 2’ థియేటర్లలో విడుదలైంది.