Mohan Lal Ivory Case | మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌కు సంబంధించిన ఏనుగు దంతాల (Ivory Tusks) కేసులో కేరళ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నటుడి వద్ద ఉన్న దంతాల సేకరణను చట్టబద్ధం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన యాజమాన్య ధృవీకరణ (ivory ownership) పత్రాలు చట్టవిరుద్ధమని, న్యాయపరంగా అమలు చేయడానికి అనర్హమని కోర్టు తాజాగా ప్రకటించింది. జస్టిస్ ఏ.కె. జయశంకరన్ నంబియార్, జస్టిస్ జోబిన్ సెబాస్టియన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ తీర్పును ఇవ్వగా.. ఈ తీర్పుతో మోహన్‌లాల్ ఏనుగు దంతాల కేసు మరోసారి కొత్త మలుపు తిరిగింది.
2016 జనవరి, ఏప్రిల్ నెలల్లో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ద్వారా మోహన్‌లాల్‌కు జారీ చేసిన యాజమాన్య ధృవీకరణ పత్రాలను వాటికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను కోర్టు తాజాగా కొట్టివేసింది. ఈ ఉత్తర్వులను జారీ చేసేటప్పుడు వన్యప్రాణి సంరక్షణ చట్టం (Wildlife Protection Act, 1972) లోని విధానపరమైన నిబంధనలను పాటించలేదని, ముఖ్యంగా తప్పనిసరిగా ఉండాల్సిన అధికారిక గెజిట్ ప్రచురణ (Official Gazette Notification) జరగలేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కారణంగా ప్రభుత్వ ఉత్తర్వులు ప్రారంభం నుంచే చెల్లనివి అని పేర్కొంది. అయితే వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972లోని సెక్షన్ 44 ప్రకారం చట్టపరమైన నిబంధనలను అనుసరించి, అవసరమైన అన్ని ప్రక్రియలను పాటించిన తర్వాత కొత్త నోటిఫికేషన్‌ను జారీ చేసే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని హైకోర్టు తెలిపింది. మరోవైపు ఈ అంశంపై నటుడిపై ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసు విచారణకు తమ తీర్పు అడ్డంకి కాదని కోర్టు స్పష్టం చేసింది. ధృవీకరణ పత్రాలు ఎలా జారీ చేయబడ్డాయనే అంశంపై తాము వ్యాఖ్యానించడం లేదని అలా చేస్తే క్రిమినల్ కేసు విచారణపై ప్రభావం పడుతుందని బెంచ్ తెలిపింది.
2012లో మోహన్‌లాల్ నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేసినప్పుడు రెండు జతల ఏనుగు దంతాలు లభించాయి. ఈ దంతాలకు సంబంధించి సరైన అనుమతులు లేకపోవడంతో అటవీ శాఖ ఆయనపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగా ఆయనకు యాజమాన్య పత్రాలు మంజూరు చేయగా వాటిని సవాలు చేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (PILs) దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలపైనే హైకోర్టు తాజాగా ఈ తీర్పునిచ్చింది.