ప్రభాస్ హీరోగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లతో జాతీయస్థాయిలో రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో పలువురు అగ్ర తారలు అతిథి పాత్రల్లో కనిపించి అభిమానుల్ని అలరించారు. కథానాయిక కీర్తిసురేష్‌కు సైతం ‘కల్కి’లో ఓ పాత్రను పోషించే అవకాశం వచ్చిందట.
అయితే అనివార్యకారణాల వల్ల ఆ ఆఫర్‌ను తిరస్కరించిందట. ఈ విషయాన్ని కీర్తి సురేష్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌పై ఉన్న గౌరవం, దర్శకుడు నాగ్అశ్విన్ పట్ల ఉన్న అభిమానంతో ఎలాగైనా ఈ ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్‌లో భాగం కావాలని కోరుకుందట.
దాంతో సినిమాలో ప్రభాస్ ఉపయోగించిన కారు బుజ్జికి వాయిస్ ఓవర్ అందించే అవకాశాన్ని కీర్తి సురేష్‌కు ఇచ్చారు. బుజ్జి పాత్రకు కీర్తి సురేష్ చెప్పిన తెలుగు డబ్బింగ్ అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ భామ నటించిన తమిళ చిత్రం ‘రఘు తాత’ ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకురానుంది.