చిరకాల మిత్రుడు ఆంటోనిని పెళ్లాడి, వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది అందాలభామ కీర్తిసురేశ్. ఓ వైపు భార్యగా బాధ్యతలను నిర్వహిస్తూనే, మరోవైపు సినిమాల్లోనూ బిజీగా ఉన్నది. ఇటీవలే ‘బేబీజాన్’తో బాలీవుడ్ ప్రేక్షకుల్ని కూడా పలకరించింది. ఇదిలావుంటే.. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో కెరీర్ తొలినాళ్ల జ్ఞాపకాలను నెమరువేసుకున్నది కీర్తి సురేష్. ఆమె మలయాళంలో బాలనటిగా కెరీర్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. మలయాళ అగ్రనటుడు దిలీప్ హీరోగా నటించిన ‘కుబేరన్'(2002) సినిమాలో కూడా ఆమె బాలనటిగా నటించింది.
ఆ రోజుల్ని కీర్తి గుర్తు చేసుకుంటూ.. ‘కథ రీత్యా ఆ సినిమాలో దిలీప్ ముగ్గురు పిల్లల్ని దత్తత తీసుకుంటారు. వారిలో నేను ఒకదాన్ని. షూటింగ్ టైమ్‌లో దిలీప్సార్ని ‘అంకుల్’ అని పిలిచేదాన్ని. ఆ తర్వాత కొన్నేళ్లకు హీరోయిన్ అయ్యాను. ‘రింగ్ మాస్టర్'(2014)లో దిలీప్సార్కు జోడీగా నటించే ఛాన్స్ వచ్చింది.
హీరోయిన్గా అది నా రెండో సినిమా. ‘రింగ్ మాస్టర్’లో నాది ఆయన గాళ్‌ఫ్రెండ్ క్యారెక్టర్ అని తెలియగానే, దిలీప్ నన్ను పిలిచి, ‘చిన్నప్పుడు అంకుల్ అని పిలిచేదానివి. ఇప్పుడు మాత్రం అలా పిలవకు. కావాలంటే ‘చేట్ట’(అన్నయ్య) అని పిలువు.’ అని అన్నారు. నేను వెంటనే ‘సరే చేట్టా..’ అనేశాను. ‘రింగ్ మాస్టర్’ హీరోయిన్గా నా తొలి హిట్.’ అని గుర్తు చేసుకున్నది కీర్తి సురేష్.