Keerthy Suresh | నాయిక కీర్తి సురేష్ ప్రేమలో ఉందనే వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగాప్రచారమవుతున్నాయి. కీర్తి జీవితంలోని మిస్టరీ మ్యాన్ ఎవరు అంటూ కథనాలు వెలువడ్డాయి. ఆమె తన మిత్రుడు, దుబాయ్ బిజినెస్‌మ్యాన్ ఫర్హాన్ బిన్ లిఖాయత్తో వివాహానికి సిద్ధమైందనేది వీటి సారాంశం. ఈ నేపథ్యంలో స్పందించింది కీర్తి సురేష్. సోమవారం ఆమె ట్వీట్ చేస్తూ…‘ఈసారి వార్తల్లోకి నా ప్రియ మిత్రుడిని తీసుకొచ్చారా. ఒక్కసారి కూడా మీరు సరిగ్గా ఊహించలేకపోతున్నారు.
నా జీవితంలోని నిజమైన మిస్టరీ మ్యాన్ ఎవరో సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెబుతాను. అప్పటిదాకా ప్రశాంతంగా వేచి ఉండండి’ అని పేర్కొంది. ఇక కెరీర్ పరంగా చూస్తే గతేడాది ఈ మలయాళ భామ వైవిధ్యమైన చిత్రాల్లో నటించినా విజయాలు కలిసిరాలేదు. ఇటీవల ‘దసరా’తో ఘన విజయాన్ని అందుకుని మళ్లీ తన క్రేజ్ నిలబెట్టుకుంది. ప్రస్తుతం ఆమె ఖాతాలో తెలుగులో చిరంజీవితో ‘భోళా శంకర్’, తమిళంలో ‘మామన్నన్’, ‘రఘుథాత’, ‘సిరెన్’, ‘రివాల్వర్ రీటా’ వంటి పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.