ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చిన్ననాటి ముచ్చట్లను గుర్తు చేసుకున్నారు మలయాళ మందారం కీర్తి సురేష్. చిన్నప్పటి తన అల్లరి గురించి చెబుతూ ‘చిన్నతనంలో బాగా అల్లరి చేసేదాన్ని. మా అమ్మనైతే ఓ రేంజ్లో ఆడుకునేదాన్ని. నాకు బాగా గుర్తు. నన్నెవరైనా తిడితే.. వాళ్లు రూమ్‌లో ఉన్నప్పుడు బయట గడి పట్టేసేదాన్ని. ఆ విధంగా మా అమ్మను చాలాసార్లు ఏడిపించా.
మీకో విషయం తెలుసా?.. ఇప్పటికీ నాకు కోపం వస్తే అదే పనిచేస్తా.’ అంటూ అందంగా నవ్వేసింది కీర్తి సురేష్. ఇంకా చెబుతూ ‘నాకు చిన్నప్పుడు రూపాయి కాయిన్స్‌ని నోట్లో పెట్టుకోవడం అలవాటు. అలా రెండుసార్లు కాయిన్స్‌ని మింగేశాను కూడా. ఆ అలవాటు మానడానికి చాలా టైమ్ పట్టింది. నిజంగా నా ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చింది సినిమాలే. సినీ నటిని అయ్యాక, నేను పూర్తిగా మారిపోయా. ముఖ్యంగా ‘మహానటి’ సినిమా వృత్తిపరంగానే కాదు, వ్యక్తిగతంగా కూడా నాలో చాలా మార్పు తెచ్చింది.’ అంటూ చెప్పుకొచ్చింది కీర్తి సురేష్.