అగ్ర కథానాయిక కీర్తి సురేష్ ఏ పాత్రలోనైనా చక్కగా ఒదిగిపోతుంది. వాణిజ్య చిత్రాలతో పాటు మహిళా ప్రధాన కథాంశాల్లో కూడా తనదైన నటనతో మెప్పిస్తుంది. ఈ ఏడాది విడుదలైన ‘దసరా’ చిత్రంలో వెన్నెలగా అద్భుతాభినయంతో మెప్పించింది. తాజాగా ఈ భామ బాలీవుడ్లో అరంగేట్రం చేస్తూ నటిస్తున్న వెబ్ సిరీస్ ‘అక్క’. పీరియాడిక్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ సిరీస్‌ను బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యష్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్నది. ధర్మరాజ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్‌లో రాధికా ఆప్టేతో కలిసి నటించనుంది కీర్తి సురేష్. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది.
ప్రస్తుతం ఈ సిరీస్ తాలూకు రిహార్సల్స్ ముంబయిలో జరుగుతున్నాయి. సోమవారం ముంబయిలో అడుగుపెట్టిన కీర్తి సురేష్ తన తొలి బాలీవుడ్ వెబ్ సిరీస్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పింది. బాలీవుడ్లో తన ప్రయాణం ఈ సిరీస్‌తో మొదలుకావడం ఆనందంగా ఉందని, తాను పోషించిన పాత్ర కూడా పూర్తి కొత్తదనంతో ఉంటుందని కీర్తి సురేష్ పేర్కొంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. కీర్తి సురేష్ ప్రస్తుతం తమిళంలో సైరన్, రఘుతాథ, రివాల్వర్ రాణి, కన్నివేడి వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.