‘మహానటి’ సావిత్రిగా శిఖర సమానమైన అభినయాన్ని ప్రదర్శించిన కీర్తిసురేష్.. ‘సర్కారువారి పాట’లో కళావతిగా యువతరం కంటికి కునుకు లేకుండా చేశారు. నటిగా ఈ పొంతన లేని కోణాలు ఆమెను నిజంగానే మహానటిని చేశాయి. ప్రస్తుతం అటు సినిమాలు, ఇటు వెబ్ సిరీస్‌లు అంటూ క్షణం తీరిక లేకుండా కెరీర్ సాగిస్తున్నారు కీర్తి సురేశ్. చెన్నయ్ టూ ముంబై వయా హైదరాబాద్.. ఇది ప్రస్తుతం కీర్తి సురేశ్ పరిస్థితి. ‘అక్క’ అనే వెబ్ సిరీస్‌తో పాటు, తమిళంలో ‘రివాల్వర్ రీటా’ అనే సినిమా కూడా చేస్తున్నారు.
ఇక తెలుగులో ‘బలగం’ఫేం వేణు యల్దెండి దర్శకత్వంలో రూపొందనున్న ‘ఎల్లమ్మ’లో టైటిల్ రోల్ కీర్తి సురేషే అని ఫిల్మ్ సర్కిల్స్‌లో వార్త బలంగా వినిపిస్తున్నది. ఇప్పటికే ‘దసరా’ సినిమాలో తెలంగాణ మహిళగా అద్భుతంగా నటించారు కీర్తి. ఇప్పుడు ‘ఎల్లమ్మ’గా ఆమె ఖరారైన మాట నిజమైతే.. రెండోసారి తెలంగాణ పడుచుగా కనిపిస్తారన్నమాట. వేణు యల్దెండి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం తెలంగాణ సంస్కృతి, నమ్మకాల నేపథ్యంలో సాగుతుందని తెలుస్తున్నది. వచ్చే నెలలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానున్నదట.