Super Star Krishna | సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. నానక్రామ్ గూడలోని విజయ్ కృష్ణ నివాసానికి చేరుకున్న కేసీఆర్.. అక్కడ కృష్ణ పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. అనంతరం మహేష్ బాబును ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించాడు. అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.
మన తెలుగు చలన చిత్ర రంగంలో సుప్రసిద్ద నటుడు కృష్ణ గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. వ్యక్తి గతంగా నేను గొప్ప మిత్రుడిని కోల్పోయాను అని అన్నారు. ఈ ఇంటికి వారి ఆతిథ్యం మేరకు చాలా సార్లు వచ్చాను. ఆయన చాలా ముక్కుసూటిగా మాట్లాడే మనిషి, అలాగే మంచి విలక్షణమైన నటుడు. పార్లమెంట్ సభ్యుడుగా దేశానికి సేవ కూడా చేశారని కొనియాడారు. అల్లూరి సీతారామరాజు సినిమా చాలా బావుందన్నప్పుడు ఆయన నవ్వారని చెప్పారు. కేసీఆర్ గారు మీరు కూడా సినిమాలు చూస్తారా? అని కృష్ణ గారు అన్నారని తెలిపారు. అల్లూరి సీతారామ రాజు సినిమా చాలా సార్లు చూశాను అని చెప్పానిట్లు సీఎం కేసీఆర్ అన్నారు. అటువంటి మంచి దేశ భక్తిని ఉద్భోదించేటువంటి గొప్ప సందేశాత్మక చిత్రం నిర్మించారు కాబట్టి.. తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో వారి అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశాలు జారిచేసింది. ఏదేమైనప్పటికి ఒక మంచి మిత్రుడిని కోల్పోయాను. ఈ సందర్భంగా కృష్ణ గారి కుటుంబానికి దుఃఖాన్ని భరించే శక్తిని ప్రసాదించాలని దేవుడిని కోరుకుంటున్నానని అన్నారు.