మలయాళ అగ్ర హీరో టొవినో థామస్, కయాదు లోహర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పీరియాడిక్ చిత్రం ‘పళ్లిచట్టంబి’ ఈ నెల 10న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. డిజో జోస్ ఆంటోని దర్శకుడు. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో చిత్ర నాయకానా యికలు టొవినో థామస్, కయాదు లోహర్ విలేకరులతో మాట్లాడారు. సోషియో పొలిటికల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా తెరకెక్కిందని, 1950 నాటి పరిస్థితులకు అద్దం పడుతుందని తెలిపారు. టొవినో థామస్ మాట్లాడుతూ ‘1950 దశకంలో కేరళలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఫిక్షనల్ స్టోరీ ఇది. అప్పటి సామాజిక పరిస్థితులను చూపించాం. అన్నింటికంటే మానవత్వం ముఖ్యమనే అంశాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించాం. ఎక్కడా మతాల ప్రస్తావన ఉండదు. చర్చి నేపథ్యంలో కొన్ని సన్నివేశాలుంటాయి’ అన్నారు. ఈ సినిమాలో తాను రెబెకా అనే ఇంటెలెక్చువల్ మహిళ పాత్రలో కనిపిస్తానని, తన కెరీర్‌ను మరింత ముందుకు తీసుకెళ్లే క్యారెక్టర్ ఇదని తెలిపింది. తన పాత్రలో సహజత్వం కోసం ఎంతో పరిశోధన చేశానని, కొన్ని పుస్తకాలను కూడా చదివానని కయాదు లోహర్ పేర్కొన్నది.