విక్కీకౌశల్తో తన ప్రేమ, పెళ్లి వ్యవహారాల్ని అస్సలు ఊహించలేదని, తామిద్దరిది విధి కలిపిన బంధమని చెప్పింది బాలీవుడ్ సీనియర్ నటి కత్రినాకైఫ్.యువ హీరో విక్కీకౌశల్తో గత ఏడాది వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిందామె. ఇటీవల ‘కాఫీ విత్ కరణ్’షోలో పాల్గొన్న కత్రినాకైఫ్ తన ప్రేమాయణం ఎలా మొదలైందో వివరించింది. ఆమె మాట్లాడుతూ ‘జోయా అక్తర్ ఇచ్చిన ఓ పార్టీలో తొలిసారి విక్కీని చూశా. అతని మాటల్లోని స్వచ్ఛత, ఏదో తెలియని అమాయకత్వం నన్ను కట్టిపడేసింది.
మొదటి పరిచయంలోనే నా హృదయానికి దగ్గరివాడు అనిపించింది. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య ఎన్నో యాదృచ్ఛిక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఏదో బలమైన కారణంతోనే అవన్నీ జరిగాయని, విధి మా ఇద్దరిని కలిపేందుకు ప్రయత్నిస్తున్నదని అర్థం చేసుకున్నా. కొంతకాలం డేటింగ్ చేశాక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం’ అని కత్రినాకైఫ్ చెప్పింది. పెళ్లయిన తర్వాత తన తొలి పుట్టిన రోజుని మాల్దీవుల్లో జరుపుకున్నామని, అప్పుడు తాను నటించిన సినిమా పాటలకు విక్కీ నృత్యాలు చేయడం ఎప్పటికీ మరచిపోలేని అనుభవమని కత్రినాకైఫ్ ఆనందం వ్యక్తం చేసింది.