పెళ్లి తర్వాత తొలిసారి షూటింగ్ సెట్లో అడుగుపెట్టింది బాలీవుడ్ నటి కత్రినాకైఫ్. కొత్త సినిమా ‘మెర్రీ క్రిస్మస్’ షూటింగ్‌ను మొదలుపెట్టింది. శనివారం చిత్రబృందంతో కలిసి దిగిన ఓ ఫొటోను ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్చేసింది కత్రినాకైఫ్. “మెర్రీ క్రిస్మస్’తో చాలా రోజుల తర్వాత తిరిగి సెట్స్‌లో అడుగుపెట్టడం ఆనందంగా ఉంది. కొత్తగా ఇండస్ట్రీకి పరిచయమైన అనుభూతి కలుగుతున్నది. నూతన ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నా. థ్రిల్లర్ సినిమాలను తెరకెక్కించడంలో శ్రీరామ్రాఘవన్ను మాస్టర్‌గా అభివర్ణిస్తుంటారు. ఆయన దర్శకత్వంలో సినిమా చేస్తుండటం గౌరవంగా భావిస్తున్నా. విజయ్ సేతుపతితో తొలిసారి కలిసి నటిస్తుండటం ఎైగ్జెటింగ్గా ఉంది’ అని కత్రినాకైఫ్ చెప్పింది. ‘అంధాదూన్’ ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకురానున్నది. చిరకాల ప్రేమికుడు విక్కీ కౌశల్‌ను ఇటీవలే పెళ్లాడింది కత్రినాకైఫ్. వీరి వివాహం ఈ నెల 9న రాజస్థాన్‌లో జరిగింది.