Karuppu | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘కరుప్పు’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్, ట్రైలర్, పాటలతో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుండగా, తాజాగా దర్శకుడు చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్జే బాలాజీ ఆసక్తికర విషయం వెల్లడించారు. ‘కరుప్పు’ కథను మొదటగా తాను సూర్య కోసం కాకుండా తలపతి విజయ్ కోసం రాసుకున్నట్లు తెలిపారు. 2023లో మూవీ స్క్రిప్ట్ ప్రారంభించినప్పుడు కథ మరింతగా పెరిగిందని, ఈ కథకు స్టార్ హీరో అవసరమని భావించి విజయ్ను కలిసి పూర్తి కథ వినిపించానని చెప్పారు.
కథ విన్న విజయ్ వెంటనే స్పందిస్తూ షూటింగ్ ఎప్పుడు మొదలుపెడతావని అడిగారని, అయితే సరైన ప్రిపరేషన్ కోసం కొంత సమయం కావాలని తాను చెప్పినట్లు బాలాజీ వివరించారు. ఇదే సమయంలో విజయ్ తన రాజకీయ ప్రయాణం, ముఖ్యంగా పార్టీ కార్యక్రమాలతో బిజీ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని తెలిపారు. తర్వాత అదే కథను సూర్యకు వినిపించగా, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పారు. అయితే సూర్య ఇమేజ్, బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా కథలో, పాత్రలో కొన్ని మార్పులు చేసినట్లు చెప్పారు. ఈ విధంగా ‘కరుప్పు’ కథ విజయ్ నుంచి సూర్య వరకు రావడం, అందుకు సంబంధించిన ప్రయాణం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇక చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న సూర్య, ఈ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. సినిమాలో త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తుండగా, యోగి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. మూవీకి సంబంధించిన విడుదలైన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ మూవీ సూర్యకి మంచి హిట్ అందించడం ఖాయం అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. స్టార్ కాస్టింగ్‌తో వస్తున్న ‘కరుప్పు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుందో అన్న ఆసక్తి ఇప్పుడు ప్రేక్షకుల్లో నెలకొంది.