Karuppu | తమిళ స్టార్ హీరో సూర్య నటించిన భారీ చిత్రం ‘కరుప్పు’ విడుదలకు ఎట్టకేలకు అడ్డంకులు తొలగాయి. గత కొన్ని రోజులుగా ఈ సినిమా విడుదలపై నెలకొన్న అనిశ్చితి అభిమానులను, నిర్మాతలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. అయితే అన్ని సమస్యలు సద్దుమణగడంతో సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 15 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. తెలుగులో ఈ సినిమా ‘వీరభద్రుడు’ పేరుతో విడుదల అవుతోంది. సినిమా విడుదల సందర్భంగా సూర్య అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. “డియర్ ఆల్.. మాతో ఉన్నందుకు ధన్యవాదాలు. ఈ రోజు నుంచి ‘కరుప్పు’, ‘వీరభద్రుడు’ థియేటర్లలో విడుదల అవుతున్నాయి” అంటూ ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ సందేశం అభిమానుల్లో ఆనందాన్ని నింపుతోంది.
మొదట ఈ చిత్రాన్ని మే 14న విడుదల చేయాలని భావించినప్పటికీ, చివరి నిమిషంలో కొన్ని కారణాలతో విడుదల వాయిదా పడింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ప్రేక్షకులకు క్షమాపణలు తెలిపింది. కొన్ని ప్రయాణాలు కాలాన్ని మాత్రమే కాదు.. మనసును కూడా పరీక్షిస్తాయి. సినిమా కోసం ఎదురుచూసిన ప్రతి ఒక్కరికీ మేము క్షమాపణలు చెబుతున్నాం. విడుదలలో జరిగిన ఆలస్యం మమ్మల్ని కూడా బాధించింది. అయినప్పటికీ మాపై మీరు చూపించిన నమ్మకం, ప్రేమ మాకు ఎంతో బలం ఇచ్చాయి అంటూ నిర్మాణ సంస్థ భావోద్వేగ ప్రకటన విడుదల చేసింది.
అలాగే ‘కరుప్పు’ కేవలం తమ సినిమా మాత్రమే కాదని, ప్రేక్షకులందరి కథ అని పేర్కొంది. ఎన్నో కష్టాలు, నిద్రలేని రాత్రుల తర్వాత ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని తెలిపింది. తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో విడుదల ఆగిపోయిన సమయంలో ముంబై, పుణెలోని కొన్ని థియేటర్లలో సినిమా ప్రదర్శన జరిగినట్లు సమాచారం రావడంతో నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సినిమా పైరసీకి గురయ్యే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు. సూర్య సరసన త్రిష హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. సంగీతాన్ని సాయి అభ్యంకర్ అందించారు. తమిళనాడులో ఉదయం నుంచే ప్రదర్శనలు ప్రారంభం కాగా, తెలుగులో ఉదయం 10 గంటల తర్వాత షోలు మొదలు కానున్నాయి.