Kartik Aaryan – Sreeleela First look | బాలీవుడ్ నుంచి వచ్చిన క్లాసిక్ చిత్రాలలో ఆషికి ఒకటి. ఈ ఫ్రాంచైజ్ నుంచి ఫస్ట్ పార్ట్ 1990లో రాగా సూపర్ హిట్ అందుకుంది. అనంతరం 2013లో ఆషికి 2 రాగా.. దాదాపు రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సూపర్ హిట్‌గా నిలవడమే కాకుండా ఆ ఏడాది చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధ కపూర్ జంటగా నటించారు. అయితే ఆషికి 2 వచ్చిన 12 ఏండ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు తెలుస్తుంది. టైటిల్ అనౌన్స్మెంట్ చేయలేదు కానీ ఈ సినిమా స్టోరీ చూస్తుంటే ఆషికి 3 అని తెలుస్తుంది.
సంగీత నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాతోనే తెలుగు భామ శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ అంటూ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో కార్తీక్ ఆర్యన్ సింగర్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు అనురాగ్ బసు(Anurag Basu) దర్శకత్వం వహిస్తుండగా.. గుల్షన్ కుమార్ & టి-సిరీస్ ప్రెజెంటేషన్, ఎ టి-సిరీస్ ఫిల్మ్స్ & అనురాగ్ బసు ప్రొడక్షన్ బ్యానర్లపై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ నిర్మిస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఈ సినిమాకు సంగీత దిగ్గజం ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.