Chandu Champion | కార్తీక్ ఆర్యన్.. బాలీవుడ్లో ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరిది. పుష్కర కాలం కిందట ‘ప్యార్ కా పంచునామా’ అనే సినిమాతో హిందీనాట తెరంగ్రేటం చేసి, తొలి సినిమాతోనే బంపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ‘లుకా చుప్పి’, ‘పతి ఔర్ పత్నీ వో’, ‘సత్యప్రేమ్ కి కథ’ వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల బొమ్మలతో ఏకంగా స్టార్ హీరో రేంజ్‌కు వెళ్లాడు. ఇక ఈ కుర్ర హీరో తాజాగా నటిస్తున్న చిత్రం ‘చందూ ఛాంపియన్’(Chandu Champion). బజరంగీ భాయిజాన్, ఏక్ థా టైగర్(Ek Tha Tiger) చిత్రాల ఫేమ్ కబీర్‌ఖాన్ (Kabhir khan) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
ప్రస్తుతం జమ్మూ & కాశ్మీర్లో ఈ సినిమా రెండవ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుండగా.. ఈ షూటింగ్ సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ షూటింగ్లో భాగంగా.. 8 నిమిషాల వార్ సీక్వెన్స్‌ను సింగిల్ షాట్లో చిత్రీకరించినట్లు చిత్రబృందం తెలిపింది. ఇక ఈ షూటింగ్‌ను సముద్ర మట్టానికి 9000 అడుగుల ఎత్తులో చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. కాగా దీనిపై కార్తీక్ ఆర్యన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
”ఈ 8 నిమిషాల నిడివి గల సింగిల్ షాట్ వార్ సీక్వెన్స్.. నా యాక్టింగ్ కెరీర్లో అత్యంత సవాలుగా, అద్భుతమైనదిగా, కష్టతరంగానే కాకుండా మరపురాని షాట్‌గా మారింది. కబీర్‌ఖాన్ సార్.. జీవితాంతం గుర్తుంచుకునే ఇలాంటి జ్ఞాపకాన్ని అందించినందుకు ధన్యవాదాలు.” అంటూ కార్తీక్ ఆర్యన్ రాసుకోచ్చాడు.
స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న చందు ఛాంపియన్‌కు కబీర్ ఖాన్ దర్శకత్వం వహించగా, నదియావాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సాజిద్ నదియద్వాలా నిర్మించారు. భారతదేశం నుండి మొదటి పారాలింపిక్ బంగారు పతక విజేతగా నిలిచిన ఫ్రీస్టైల్ స్విమ్మర్ మురళీకాంత్ పేట్కర్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుంది. 1965 ఇండో-పాక్ యుద్ధంలో తీవ్రంగా గాయపడిన మురళీకాంత్ అంగ వైకల్యానికి గురయ్యారు. అయినా మొక్కవోని ధైర్యంతో 1972లో జరిగిన ప్రపంచ పారాలింపిక్స్‌లో పాల్గొని ఈత విభాగంలో గోల్డ్ మెడల్‌ను సాధించారు. ఆయన స్ఫూర్తివంతమైన ప్రయాణాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించబోతున్నారని తెలిసింది. ఇక ఈ సినిమా 2024లో విడుదల కానుంది.