తమిళ అగ్ర హీరో కార్తీ.. రుణం తీర్చుకునే పనిలో ఉన్నారు. ఎవరి రుణం అనుకుంటున్నారా? ఆ వివరాల్లోకెళ్తే.. కార్తీ అన్నయ్య సూర్యను హీరోగా నిలబెట్టిన సినిమా అంటే టక్కున గుర్తొచ్చే పేరు ‘కాఖా కాఖా’. గౌతమ్ వాసుదేవ మీనన్ ఆ సినిమాకు దర్శకుడు. ‘కాఖా కాఖా’ తర్వాత హీరోగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం సూర్యకు లేకపోయింది. ప్రస్తుతం సౌత్‌లో ఉన్న పానిండియా హీరోల్లో సూర్య ఒకరు. ఈ వైభవానికి కారణం ‘కాఖా కాఖా’.
ప్రస్తుతమైతే దర్శకుడిగా గౌతమ్ మీనన్ పరిస్థితి అంత బాలేదు. అందుకే ఆయన నటుడిగా బిజీ అయిపోయారు. రీసెంట్గా ‘డ్రాగన్’ సినిమాలో కూడా మంచి పాత్రలో మెరిశారు. అయితే.. మెగాఫోన్ మీద మమకారం మాత్రం ఆయనను వీడిపోలేదు. అందుకే.. ఇటీవల హీరో కార్తీకి ఓ కథ వినిపించారట. అది కూడా ఆయన కథ కాదు.
జయమోహన్ అనే రచయిత రాసిన కథ. తనే స్క్రీన్‌ప్లే కూడా అందించారట. దర్శకుడు మాత్రం గౌతమ్ వాసుదేవ మీననే. కథ కార్తీకి బాగా నచ్చడంతో.. దర్శకుడిగా గౌతమ్ వాసుదేవ మీనన్ ప్రస్తుత పరిస్థితిని అస్సలు పట్టించుకోకుండా ‘గోహెడ్’ అంటూ పచ్చజెండా ఊపేశారట కార్తీ. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనున్నదని చెన్నయ్ వర్గాల సమాచారం. అన్నకు బ్రేక్ ఇచ్చిన రుణాన్ని తమ్ముడు ఇలా తీర్చుకుంటున్నాడన్నమాట.