తమిళ, తెలుగు భాషల్లో విజయాన్ని సాధించి, కార్తీకి సూపర్‌స్టార్‌డమ్‌ని కట్టబెట్టిన సినిమా ‘ఖైదీ’. ఈ సినిమా సీక్వెల్ కోసం సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కోలీవుడ్ ఓ తీపి కబురు అందించింది. ‘ఖైదీ 2’ స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, ‘కూలీ’ తర్వాత లోకేష్ కనకరాజ్ చేయబోయే సినిమా ‘ఖైదీ 2’నే అని కోలీవుడ్ సమాచారం. అయితే.. ఇది ‘ఖైదీ’కి సీక్వెల్ కాదట.. ప్రీక్వెల్.
జైలు నుండి ఢిల్లీ(కార్తీ) విడుదలయ్యాక ఏం జరిగింది? అనేది ‘ఖైదీ’లో చూపించిన లోకేష్.. అసలు జైలుకు ఢిల్లీ ఎందుకెళ్లాడు? అనే విషయాన్ని ప్రీక్వెల్‌లో చూపించబోతున్నాడు. ‘ఖైదీ’ తర్వాత తన దర్శకత్వం వహించిన విక్రమ్, లియో, కూలీ చిత్రాలను లెక్కకు మించిన స్టార్లతో నింపేశారు లోకేష్ కనకరాజ్. అలాగే.. ఈ ‘ఖైదీ 2’లోనూ పలు స్టార్లు దర్శనమివ్వనున్నారట.
లోకేష్ కనకరాజ్ యూనివర్స్‌లోని ముఖ్యపాత్రలన్నీ ఒకేసారి తెరపైకి వస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ప్రస్తుతం ‘ఖైదీ2’తో అలాంటి ప్రయత్నమే చేయనున్నారట లోకేష్. ఇందులో కథానాయికగా సమంత ఫిక్స్ అయ్యింది.