Karnataka Cinema Price Cap | సినిమా టికెట్ ధరలపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని అన్ని థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో సినిమా టికెట్ ధర గరిష్టంగా రూ.200గా మాత్రమే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ప్రేక్షకులకు సినిమాను మరింత అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. గతంలో మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరలు రూ.600 నుంచి రూ.1000 వరకు కూడా ఉన్న సందర్భాలున్నాయని.. ఈ అధిక ధరల వల్ల సామాన్య ప్రజలు సినిమాకు వెళ్లడం కష్టమవుతోందని ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయం ప్రకారం.. టికెట్ ధర పన్నులతో కలిపి రూ.236 వరకు ఉండబోతుంది. ఈ నిబంధన IMAX, 4DX వంటి స్పెషల్ ఫార్మాట్లకు, అలాగే రిక్లైనర్ సీట్లకు కూడా వర్తిస్తుందని తెలిపింది. అయితే 75 సీట్ల కంటే తక్కువ కెపాసిటీ ఉన్న ప్రీమియం స్క్రీన్లకు మాత్రం మినహాయింపును ఇచ్చింది.