Karnataka Theatres | రాష్ట్రంలో ఉన్న సినిమా థియేటర్లకు, మల్టీప్లెక్స్‌లకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది కర్ణాటక ప్రభుత్వం. ఇకపై థియేటర్లలో విడుదలయ్యే అన్ని భాషల సినిమాలకు వినోదపు పన్నుతో కలిపి సినిమా టికెట్ ధర గరిష్ఠంగా రూ.200 మించకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది. వీటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే 15 రోజుల్లో తెలియజేయాలని కోరింది.
ప్రేక్షకులకు సినిమాను మరింత అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది. గతంలో మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరలు రూ.600 నుంచి రూ.1000 వరకు కూడా ఉన్న సందర్భాలున్నాయని.. ఈ అధిక ధరల వల్ల సామాన్య ప్రజలు సినిమాకు వెళ్లడం కష్టమవుతోందని ప్రభుత్వం వెల్లడించింది.
అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సినీ పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు సామాన్య ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తుండగా, మరోవైపు మల్టీప్లెక్స్ యజమానులు తమ ఆదాయంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రీమియం ఫార్మాట్లు, ఐమాక్స్ (IMAX), 4డిఎక్స్ (4DX) వంటివి భారీ పెట్టుబడులతో నిర్మించబడతాయని, వాటికి కూడా ఒకే ధర పరిమితి విధించడం వల్ల నష్టాలు వస్తాయని వారు వాదిస్తున్నారు. ఈ విషయమై మల్టీప్లెక్స్ అసోసియేషన్లు కోర్టును ఆశ్రయించే అవకాశం కూడా ఉంది. మరోవైపు కన్నడ సినీ పరిశ్రమలోని కొన్ని వర్గాలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. టికెట్ ధరలు తగ్గితే ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని, ఇది చిన్న సినిమాలకు కూడా మేలు చేస్తుందని వారి అభిప్రాయం. ఈ కొత్త నిబంధన సినీ పరిశ్రమపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.