Raja Hindustani | బాలీవుడ్ నటులు ఆమిర్ ఖాన్, కరిష్మా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘రాజా హిందుస్థానీ’. 1996లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా ఆమిర్ ఖాన్, కరిష్మా కపూర్ల కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాకు ధర్మేష్ దర్శన్ దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమాలో ఒక ఐకానిక్ ముద్దు సన్నివేశం ఉన్న విషయం తెలిసిందే. సుదీర్ఘమైన ఈ ముద్దు సన్నివేశం అప్పట్లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ ఐకానిక్ ముద్దు సీన్ షూటింగ్ సమయంలో తాము చాలా ఇబ్బందులు పడ్డామని తెలిపింది కరిష్మా. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..
రాజా హిందుస్థానీలో ఉన్న ఆ ముద్దు సన్నివేశం గురించి ప్రజలు చాలా గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఆ సీన్ కోసం మూడు రోజుల పాటు మేము పడ్డ కష్టం గురించి ఎవరికీ తెలియదు. ఊటీలో ఫిబ్రవరి నెలలో ఈ సీన్ షూటింగ్ జరిగింది. ఆ సమయంలో అక్కడ విపరీతమైన చలి ఉండేదని కరిష్మా తెలిపింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు షూటింగ్ జరిగేది. ప్రతి టేక్ మధ్యలో కూడా మేము వణుకుతూ ఉండేవాళ్ళం. ఈ ముద్దు సీన్ ఎప్పుడు పూర్తవుతుంది? అని మేము అనుకునేవాళ్ళం అని కరిష్మా తెలిపారు. ఆ సమయంలో నటులు చాలా కష్టమైన పరిస్థితులలో పని చేసేవారని ఇది ఒక భిన్నమైన అనుభవం అని కరిష్మా పేర్కొన్నారు.
మరోవైపు ఈ సినిమాకు దర్శకత్వం వహించిన ధర్మేష్ దర్శన్ కూడా ఈ సీన్ గురించి మాట్లాడుతూ.. ఆ రోజుల్లో ముద్దు సన్నివేశాలు చాలా అరుదుగా ఉండేవి.. అందుకే తాను ఈ సీన్ గురించి కరిష్మా తల్లి బబితా కపూర్‌కు ముందే తెలియజేశానని.. ఈ సీన్ జరిగేటప్పుడు ఆ మూడు రోజుల పాటు కరిష్మా సెట్లో ఉన్నారని వెల్లడించారు. ఈ సన్నివేశం చిత్రీకరణకు దాదాపు 47 రీటేక్‌లు తీసుకున్నట్లు సమాచారం.