Raja Saab | వరుస సక్సెస్‌లతో జోరు మీదున్న ప్రభాస్ ప్రస్తుతం డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో ది రాజాసాబ్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై అభిమానులలో ఏ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట ఈ కాంబోకు వ్యతిరేకంగా కొందరు విమర్శలు చేసినా, ఆ తర్వాత మారుతీ రిలీజ్ చేసిన అప్డేట్స్తో అందరు సినిమాపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఓ వైపు షూటింగ్ పనులు చేస్తూనే మరోవైపు వరుస అప్డేట్స్ ఇస్తూ సినిమా పట్ల ఆసక్తి పెంచుతుంది చిత్ర బృందం. జూలై మొదటి వారం నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది.
ఈ షెడ్యూల్లో ప్రభాస్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. వీటితో పాటు, చిత్రానికి సంబంధించి మిగిలిన ఒకే ఒక్క స్పెషల్ సాంగ్ చిత్రీకరించనున్నారు. ఈ స్పెషల్ సాంగ్‌ను ప్రభాస్ మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా, స్టైల్‌గా, గ్రాండ్‌గా రూపొందించాలని దర్శకుడు మారుతి గట్టి ఆలోచనలతో ఉన్నట్టు సమాచారం. సాంగ్ మరింత అట్రాక్టివ్‌గా ఉండేందుకు ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మొదట బాలీవుడ్ హిట్ సాంగ్‌ను రీమిక్స్ చేయాలనుకున్నప్పటికీ, ఆ ఆలోచనను వదిలేసి కొత్తగా స్వయంగా ట్రాక్ కంపోజ్ చేస్తున్నాడని టాక్.
ఈ పాటలో ప్రభాస్‌కు జోడీగా స్టార్ హీరోయిన్ అవసరం ఉండటంతో, తొలుత నయనతారను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆమె ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్టు సమాచారం. ఈ కారణంగా కొన్ని రోజులుగా ఈ పాటపై బజ్ తగ్గింది. కానీ తాజాగా కొత్త క్రేజ్ పెంచే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. బాలీవుడ్లో ‘ఫెవికాల్ సే’, ‘చమ్మక్ చల్లో’ వంటి స్పెషల్ నెంబర్లతో అదరగొట్టిన కరీనా కపూర్ ఈ పాట కోసం ఎంపిక చేసే అవకాశాలున్నాయని ఇండస్ట్రీలో జోరుగా చర్చ జరుగుతోంది. దర్శకుడు మారుతి ఆమెను స్పెషల్ సాంగ్ కోసం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ కథానయికలుగా నటిస్తున్న విషయం తెలిసిందే.