Karate Kalyani | బిగ్‌బాస్ ఫేమ్, నటుడు శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. నిండుగా కప్పుకునే దుస్తుల్లోనే నిజమైన అందం ఉంటుందని, అసభ్యంగా అనిపించే దుస్తులు ధరిస్తే చూసేవాళ్లు బయటకు నవ్వినా లోపల మాత్రం విమర్శిస్తారని శివాజీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై పలువురు సినీ ప్రముఖులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఖండించారు.ఈ విషయంలో యాంకర్, నటి అనసూయ భరద్వాజ్‌తో పాటు గాయని చిన్మయి వంటి వారు శివాజీ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించారు. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని వారు స్పష్టం చేశారు. అయితే ఇదే వివాదంలో కొంతమంది మాత్రం శివాజీకి మద్దతుగా నిలుస్తున్నారు. వారిలో నటి కరాటే కళ్యాణి కూడా ఒకరు.
కరాటే కళ్యాణి మొదటి నుంచి శివాజీకి మద్దతుగా మాట్లాడుతూ వస్తోంది. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదని, హీరోయిన్లు పబ్లిక్ ఫంక్షన్లకు హాజరయ్యే సమయంలో కొంత హద్దు పాటించాలన్నదే శివాజీ ఉద్దేశమని పలు టీవీ ఛానల్ డిబేట్స్‌లో వ్యాఖ్యానించింది. వ్యక్తిగత స్వేచ్ఛకు తాను వ్యతిరేకం కాదని, అయితే పబ్లిక్ వేదికలపై సంయమనం అవసరమని ఆమె అభిప్రాయపడింది. ఈ క్రమంలో అనసూయను ఉద్దేశిస్తూ చేసిన కొన్ని వ్యాఖ్యలు మరింత వివాదానికి దారితీశాయి. ఇక ఈ అంశంపై శివాజీ ప్రెస్‌మీట్ నిర్వహించి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా అనసూయకు కౌంటర్ ఇచ్చినట్లు ఆయన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీనిపై అనసూయ స్పందిస్తూ, తనపై వ్యాఖ్యలు చేసిన వారితో పాటు ప్రెస్మీట్లో మాట్లాడిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, లీగల్ నోటీసులు పంపిస్తామని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో కరాటే కళ్యాణి గురువారం సోషల్ మీడియాలో ఓ ఇండైరెక్ట్ పోస్ట్ పెట్టింది. అందులో అనసూయ పేరు ప్రస్తావించకపోయినా, ‘కనసూయ’ అంటూ పేర్కొనడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. “మంచిగా పద్ధతిగా ఉండమని చెప్పితే లీగల్ నోటీసులా? కేసులు వేయడం మాకూ తెలుసు” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కరాటే కళ్యాణి పోస్ట్‌ను అనసూయను ఉద్దేశించిందేనని నెటిజన్లు భావిస్తున్నారు. శివాజీతో పాటు కళ్యాణికి కూడా అనసూయ లీగల్ నోటీసులు పంపినట్లు ఈ పోస్టు ద్వారా అర్థమవుతోందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వివాదం ఎటు దారి తీస్తుందో, కరాటే కళ్యాణి కూడా చట్టపరమైన చర్యలకు దిగుతుందా అనే అంశం ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తిగా మారింది.