Anvesh | ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్, ‘ప్రపంచ యాత్రికుడు’గా పేరుగాంచిన అన్వేష్ చుట్టూ వివాదాలు ముదురుతున్నాయి. హిందూ దేవతలు, మత విశ్వాసాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆయనపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో సినీ నటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి అన్వేష్‌పై ఫిర్యాదు చేశారు. దేవుళ్లను దూషిస్తూ హిందూ ధర్మ భావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు చేశారని ఆమె ఆరోపించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, విచారణ నిమిత్తం అన్వేష్‌కు త్వరలో నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం కరాటే కళ్యాణి మీడియాతో మాట్లాడుతూ అన్వేష్‌పై తీవ్రంగా మండిపడ్డారు. హిందూ–ముస్లిం మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నాడని ఆరోపించారు. 2.5 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్న అన్వేష్‌కు వచ్చే ఆదాయం మన దేశం నుంచే వెళ్తోందని, అలాంటి వ్యక్తి దేశ సంస్కృతిని విమర్శిస్తే సహించరాదన్నారు. వెంటనే అతడి యూట్యూబ్ ఛానల్‌ను అన్‌సబ్‌స్క్రైబ్ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లోనూ సీతాదేవి, ద్రౌపదిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మరో కేసు నమోదవడం గమనార్హం.
కేవలం దేవుళ్లపైనే కాకుండా నటుడు శివాజీ, ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై కూడా అన్వేష్ చేసిన వ్యాఖ్యలు నెటిజన్ల ఆగ్రహానికి కారణమయ్యాయి. ప్రస్తుతం విదేశాల్లో ఉంటూ వీడియోలు చేస్తున్న అన్వేష్‌ను తక్షణమే భారత్‌కు రప్పించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒకవైపు నెటిజన్లు పెద్ద ఎత్తున అన్‌ఫాలో, అన్‌సబ్‌స్క్రైబ్ చేస్తున్నా, మరోవైపు అన్వేష్ మరింత రెచ్చగొట్టే వీడియోలు చేయడం పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చుతోంది. ఈ వ్యవహారంపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.