Karate Kalyani |హీరోయిన్లు వేసుకునే దుస్తులపై సినీనటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికి దారితీసిన నేపథ్యంలో, ఈ అంశంపై సినీనటి కరాటే కల్యాణి స్పందించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, శివాజీ వ్యాఖ్యలను సమర్థిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “నేను శివాజీని సమర్థిస్తాను. ఎందుకంటే భారతదేశంలో స్త్రీలకు ఎంతో ఔన్నత్యం ఉంది. ఇండస్ట్రీలోనే కాదు, ప్రతి చోటా మన భారతీయ స్త్రీని గౌరవంగా చేతులెత్తి నమస్కరిస్తాం. కట్టు, బొట్టు మన సంప్రదాయం. భారతదేశం అంటే అందరికీ గౌరవం ఉంటుంది. అయితే శివాజీ చెప్పిన విధానంలో కొంచెం తేడా ఉండొచ్చు కానీ ఆయన ఉద్దేశం తప్పు కాదు” అని కరాటే కల్యాణి వ్యాఖ్యానించారు. శివాజీ మాట్లాడిన ఒక మాటను మాత్రమే తీసుకుని తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని ఆమె అన్నారు.
చికిరి చికిరి అనే పాటలో కూడా ఇలాంటి పదాలు వాడారు. అప్పుడు వాటిని తీసేయాలని చిన్మయి ఎందుకు అడగలేదు? దానిపై ఆమె ఎందుకు ట్వీట్ చేయలేదు? అంటూ ప్రశ్నించారు. ఇక డ్రెస్సింగ్ విషయంలో కూడా ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. “డ్రెస్సింగ్ ఎవరి సెన్స్ వాళ్లదే కావచ్చు. కానీ అనసూయ తన అబ్బాయి ఒడుగు కార్యక్రమంలో పిచ్చి డ్రెస్ వేసుకుని ఎందుకు కూర్చోలేదు? పట్టు చీర ఎందుకు కట్టుకుంది? అంటే వాళ్లకు సంప్రదాయం తెలుసు, ఆచారం తెలుసు. అవసరమైనప్పుడు సంప్రదాయాలను గుర్తు చేసుకుంటారు” అని వ్యాఖ్యానించారు.ఇండస్ట్రీలో ఎదిగినవారు రోల్ మోడల్‌గా ఉండాలని కరాటే కల్యాణి అభిప్రాయపడ్డారు. సినిమా ఇండస్ట్రీలో ఉండాలంటే అర్ధనగ్న ప్రదర్శనలు చేయాల్సిన అవసరం లేదు. చీరలు కట్టుకుని కూడా అందంగా కనిపించవచ్చు. ఎవరి ఇష్టం వాళ్లదే అయినా, ఒక బాధ్యత ఉండాలి” అన్నారు.
ఇటీవల హీరోయిన్ నిధి అగర్వాల్ వేసుకున్న డ్రెస్‌ను ప్రస్తావిస్తూ, “ఆమె ఉల్లిపొరలాంటి డ్రెస్ వేసుకుని వెళ్లింది. దానిపై నేను పోస్ట్ పెట్టాను. ఆమె డ్రెస్ బాలేదని చాలామంది కామెంట్లు చేశారు. ఈ కాలంలో అమ్మాయిలు విపరీతంగా సిగరెట్లు కాల్చుతున్నారు అంటూ సమాజంలో వస్తున్న మార్పులపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు.కరాటే కల్యాణి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శివాజీ వ్యాఖ్యలను సమర్థిస్తూ ఆమె చేసిన కామెంట్లు కొత్త చర్చకు తెరతీశాయి.