Janhvi Kapoor | అతిలోకసుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీకపూర్ టాలీవుడ్ ఎంట్రీకి.. కరణ్ జోహార్ ఇచ్చిన సలహానే కారణమని బీటౌన్ కోడై కూస్తున్నది. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ పాన్ఇండియా హీరో అయ్యారనీ, పైగా ఎంతో టాలెంట్ ఉన్న నటుడు కాబట్టి.. ఎన్టీఆర్ పక్కన నటిస్తే అడ్వాంటేజ్ ఉంటుందని ‘దేవర’కు ఓకే చెప్పించాడట కరణ్ జోహార్.
2018లో వచ్చిన ‘ధడక్’ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వి. అందంలో అదరహో అనిపించినా.. నటిగా విమర్శకుల ప్రశంసలు పొందినా.. ఒక్క కమర్షియల్ హిట్‌ను కూడా అందుకోలేక పోయింది. దాంతో ఒకప్పుడు తనతల్లి శ్రీదేవి మకుటంలేని మహారాణిగా వెలుగొందిన దక్షిణాదివైపు దృష్టిపెట్టింది. అయితే, టాలీవుడ్ – కోలీవుడ్ ఈ రెండిటిలో ఏ పరిశ్రమను ఎంచుకోవాలో నిర్ణయించుకోలేక పోయిందట.
ఇదే విషయంపై తన మెంటార్ కరణ్ జోహార్‌ను సలహా అడిగితే.. టాలీవుడ్ ద్వారా దక్షిణాదిలోకి ఎంట్రీ ఇస్తే కచ్చితంగా స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పాడట. ఆయన చెప్పినట్టుగానే.. తెలుగులో మొదటి సినిమా విడుదల అవ్వకుండానే, మరో స్టార్హీరో రామ్‌చరణ్‌తో కలిసి నటించే చాన్స్ కొట్టేసి.. టాలీవుడ్‌ను ఏలేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నది.