ఒకవైపు స్టార్లతో భారీ చిత్రాలు రూపొందిస్తూనే మరోవైపు వారసులను తెరకు తీసుకొస్తూ చిన్న చిత్రాలు చేస్తుంటారు దర్శక నిర్మాత కరణ్. ఎప్పుడు రెండు మూడు చిత్రాలతో ఆయన నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ బిజీగా ఉంటుంది. సొంత చిత్ర పరిశ్రమ అయినా బాలీవుడ్ గురించి నిర్మొహమాటంగా మాట్లాడటంలో సందేహించరు కరణ్ జోహార్. తనకున్న అనుభవంలో పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితులపై మాట్లాడుతుంటారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న కరణ్ జోహార్ హిందీ చిత్ర పరిశ్రమ వెన్నెముక లేకుండా తయారైందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ట్రెండ్‌ను పట్టుకు వేలాడటమే ఈ స్లంప్‌కు కారణమన్నారు. కరణ్ జోహార్ మాట్లాడుతూ…‘కాలానుగుణంగా మారడంలో మనం నిర్లక్ష్యం చేశాం. ‘హమ్ ఆప్కే హై కౌన్’ ఘన విజయం సాధించాక..ఇక అన్నీ రొమాంటిక్ మూవీస్ చేస్తూనే వచ్చాం. అలా స్టార్‌గా ఒక షారుఖ్‌ను తయారు చేశాం. ‘లగాన్’ రిలీజయ్యాక అదే తరహాను పట్టుకుని సాగాం. నేను కూడా ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ చిత్రాన్ని ‘లగాన్’ స్ఫూర్తితోనే తెరకెక్కించాను. ఇక ‘దబాంగ్’ సక్సెస్ అయ్యాక డజన్ల కొద్దీ కమర్షియల్ మూవీస్ చేయడం మొదలుపెట్టాం. ఇలా హిందీ సినిమా అస్తిత్వాన్ని కోల్పోయింది. వెన్నెముక లేకుండా తయారైంది.
ప్రేక్షకులకు కొత్తదనం అందించాలనే కన్విక్షన్ మన ఫిలిం మేకర్స్‌లో కొరవడింది. అందుకే ఇవాళ ప్రాంతీయ సినిమాలు సత్తా చాటుతున్నాయి’ అని అన్నారు. కరణ్ జోహార్ ప్రస్తుతం ‘రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.