Kapil Sharma : ప్రముఖ హిందీ హాస్య నటుడు కపిల్ శర్మ (Kapil Sharma) కెఫెపై దుండగులు మరోసారి కాల్పులు తెగబడ్డారు. కెనడాలోని ఆయన నడుపుతున్న కఫ్స్ కెఫె (KAP’S CAFE)పై గురువారం కొందరు తుపాకులతో కాల్పులు జరిపారు. కారులో వచ్చి.. కెఫెకు సమీపంగా వెళ్తూ దాడికి పాల్పడిన వీడియో నెట్టింట వైరలవుతోంది. నెల రోజుల వ్యవధిలోనే ఇది రెండో కాల్పుల ఘటన. ఇది తమ పనే అని గ్యాంగ్‌స్టర్ గోల్డీ ధిల్లాన్ ఆన్లైన్ పోస్ట్ ద్వారా వెల్లడించాడు.
‘జై శ్రీరాం. అందరికి రామ్ రామ్. సర్రేలోని కపిల్ శర్మ కెఫెపై ఈరోజు జరిగిన కాల్పుల దాడి మా పనే. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు అనుబంధంగా పని చేసే గోల్డీ ధిల్లాన్ గ్యాంగ్ ఈ ఘటనకు పాల్పడింది. మేము కపిల్‌కు ఫోన్ చేశాం. కానీ, అతడు ఫోన్ ఎత్తలేదు. అందుకే చర్యగా అతడి కెఫెపై కాల్పులు జరిపాం. ఇప్పటికీ కూడా మా ఫోన్ ఎత్తకుంటే.. ఈసారి ముంబైలో విధ్వంసం సృష్టిస్తాం’ అని పోస్ట్ పెట్టారు. కాల్పుల వార్త తెలియగానే కప్స్ కెఫెకి చేరుకున్న సర్రే పోలీస్ సర్వీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గోల్డీ ధిల్లాన్ పేరిట ఉన్న ఖాతాలో పెట్టిన పోస్ట్
జూలై నెలలో కెనడాలో కపిల్ కప్స్ కెఫెను ప్రారంభించారు. కెఫెన్ తెరిచిన కొన్నిరోజులకే సిబ్బంది లోపల ఉండగానే ఉదయం 1:50 సమయంలో పలుమార్లు కాల్పులు జరిపారు దుండగులు. కెఫె కిటికీలపై పది బుల్లెట్ రంధ్రాలు ఏర్పడ్డాయి. అయితే.. అదృష్టవశాత్తూ ఆ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. ‘ది కపిల్ శర్మ షో’తో పాపులర్ అయిన కపిల్ హీరోగాను వెండితెరపై మెరిశాడు. క్రూ, ఫిరంగీ, ట్యూబ్‌లైట్, కిస్ కిస్కో ప్యార్కరూన్ వంటి బాలీవుడ్ చిత్రాల్లో నటించాడీ కామెడీ కింగ్.