ఎన్టీఆర్, ఏఎన్నార్ తెలుగు సినీ రంగంలో అగ్ర హీరోలుగా రాణిస్తున్న సమయంలోనే వారికి ధీటుగా కాంతారావు నిలబడ్డారని ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కొనియాడారు. డిసెంబర్లో రవీంద్రభారతి వేదికగా కాంతారావు శత జయంతి పురస్కార సభను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
సీనియర్ హీరో సుమన్‌కు కాంతారావు శత జయంతి పురస్కారాన్ని ప్రదానం చేయబోతున్నట్లు ప్రకటించారు. శనివారం హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన దర్శకులు రేలంగి నరసింహా రావు.. కాంతారావు కత్తియుద్ధాలు తనకు చాలా ఇష్టమని చెప్పారు. కాంతారావు బయోపిక్ తీయబోతున్నానని దర్శకుడు పి.సి.ఆదిత్య తెలిపారు. ఆకృతి సుధాకర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.