Kantara Chapter 1 Trailer | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కన్నడ బ్లాక్‌బస్టర్ ‘కాంతార’ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘కాంతార చాప్టర్ 1’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హీరోగా, దర్శకుడిగా రిషబ్ శెట్టి మళ్లీ అదే మాంత్రిక ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదల కాగా, అభిమానులను పూర్తిగా మంత్ర ముగ్దులను చేసింది. ప్రభాస్ చేతుల మీదుగా విడుదలైన ఈ ట్రైలర్లో “నాన్న ఎందుకు ఇక్కడే మాయమయ్యాడు?” అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలవుతుంది. సాంకేతికంగా అత్యద్భుతంగా రూపొందిన ఈ ట్రైలర్ మొత్తం 2 నిమిషాల 56 సెకన్ల నిడివితో సాగుతుంది.
గ్రాండ్ విజువల్స్, సాలిడ్ బిజీయం (BGM),షార్ప్ షాట్స్,ఇంటెన్స్ ఎమోషన్స్, ఇవి అన్నీ కలసి ట్రైలర్‌ను అద్భుతంగా మలిచాయి. నేటివిటీ టచ్ మరింతగా ఆసక్తిని రేకెత్తిస్తుండగా, కథలో ఉత్కంఠను పెంచేలా ప్రతి షాట్ రూపుదిద్దుకుంది. మేకింగ్ స్టైల్, విజువల్ నేరేషన్ అన్నీ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సారి ‘కాంతార చాప్టర్ 1’ను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగులో గీత ఆర్ట్స్ ద్వారా రిలీజ్ కానుండగా,నైజాం ప్రాంతంలో ప్రముఖ సంస్థ మైత్రీ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను దక్కించుకుంది.
‘కాంతార’ ఫస్ట్ పార్ట్ ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న నేపథ్యంలో, ఈ సీక్వెల్‌పై అభిమానులు, సినీ ప్రేమికులు ఆశలు పెంచుకున్నారు. ట్రైలర్ విడుదల కావడం ద్వారా సినిమాపై ఉన్న ఆసక్తి మరింతగా పెరిగింది. సోషల్ మీడియాలో ట్రైలర్‌కు విశేష స్పందన లభిస్తోంది. మొత్తం మీద, ‘కాంతార చాప్టర్ 1’ ట్రైలర్ ఎమోషన్, మిస్టరీ, విజువల్స్ అన్ని విభాగాల్లో ముచ్చట పడేలా ఉంది. అప్పటి అరణ్యాల్లో దైవాంశ మూర్తీభవించిన భూతకోల ఆవిర్భావం, తదనంతర ఉత్కంఠభరిత పరిణామాలతో ఈ కథను హై ఇంటెన్సిటీ డివోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారని సమాచారం. ముఖ్యంగా క్లైమాక్స్ ఘట్టాల్ని దాదాపు 500 మంది ఫైటర్లు, వారికి సహాయకులు 3000 మంది పాల్గొనగా భారీ స్థాయిలో తెరకెక్కించారని, భారతీయ సినీ చరిత్రలో ఇదొక రికార్డని చెబుతున్నారు. హోంబలే ఫిల్మ్స్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను తెరకెక్కించింది.