Academy Awards | సినీ ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా భావించే 98వ ఆస్కార్ (Academy Awards) అవార్డుల సందడి మొదలైంది. అంతర్జాతీయ వేదికపై అప్పుడే మొదలైంది. తాజాగా అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ విడుదల చేసిన ‘రిమైండర్ లిస్ట్’లో భారత్ నుండి ఏకంగా నాలుగు చిత్రాలు చోటు దక్కించుకుని సంచలనం సృష్టించాయి. మొత్తం 201 చిత్రాలతో కూడిన ఈ జాబితాలో నిలిచిన సినిమాలు ‘ఉత్తమ చిత్రం’ (Best Picture) కేటగిరీలో పోటీ పడేందుకు అర్హత సాధించాయి. ఇందులో రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన కన్నడ బ్లాక్ బస్టర్ ‘కాంతార: ఎ లెజెండ్ – చాప్టర్ 1’ గ్లోబల్ స్థాయిలో తన పట్టు నిలుపుకోగా, అనుపమ్ ఖేర్ దర్శకత్వం వహించిన హిందీ చిత్రం ‘తన్వి ది గ్రేట్’ ఆస్కార్ రేసులో నిలిచి అందరినీ షాక్‌కి గురిచేసింది. ఇక వీటితో పాటు భారతీయ పురాణ నేపథ్యంలో వచ్చిన బహుభాషా యానిమేషన్ చిత్రం ‘మహావతార్ నరసింహ’, నూతన దర్శకుడు అభిషన్ జీవింత్ తెరకెక్కించిన తమిళ చిత్రం ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ కూడా ఈ అర్హత జాబితాలో చోటు దక్కించుకున్నాయి. రాధికా ఆప్టే నటించిన ‘సిస్టర్ మిడ్నైట్’ (UK-India కో-ప్రొడక్షన్) సైతం ఈ పోటీలో ఉండటం విశేషం. మరోవైపు భారత్ నుంచి అధికారికంగా పంపబడిన నీరజ్ ఘైవాన్ చిత్రం ‘హోమ్‌బౌండ్’ ఇప్పటికే ‘ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరీలో టాప్-15 షార్ట్‌లిస్ట్‌లో నిలిచి భారీ ఆశలు రేకెత్తిస్తోంది.
ఆస్కార్ నిబంధనల ప్రకారం.. ఈ చిత్రాలన్నీ 2025లో అమెరికాలోని ప్రధాన మెట్రోపాలిటన్ ఏరియాల్లో కనీసం ఏడు రోజులు థియేటర్లలో ప్రదర్శితమై ఉండటంతో పాటు ఆస్కార్ అకాడమీ సూచించిన ‘ఇన్‌క్లూజన్ స్టాండర్డ్స్’ ప్రమాణాలను విజయవంతంగా పూర్తిచేశాయి. అయితే ఈ జాబితాలో ఉన్నంత మాత్రాన నామినేషన్ దక్కినట్లు కాదని, అకాడమీ సభ్యుల రహస్య ఓటింగ్ ప్రక్రియ తర్వాతే అసలు విజేతలు ఎవరో తెలుస్తుందని గుర్తుంచుకోవాలని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఈ ఉత్కంఠకు తెరదించుతూ 2026 జనవరి 22న తుది నామినేషన్ల జాబితాను అకాడమీ ప్రకటించనుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూసే 98వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ వేడుక 2026 మార్చి 15న లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్లో వైభవంగా జరగనుంది. మొత్తం 24 విభాగాల్లో ఈ అవార్డులను అందజేయనుండగా, ఉత్తమ చిత్రం కేటగిరీలో 10 సినిమాలకు, మిగిలిన విభాగాల్లో ఐదేసి సినిమాలకు నామినేషన్లు దక్కనున్నాయి.