కన్నడ చిత్రం ‘కాంతార’ దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. దక్షిణ కన్నడ సంస్కృతి, ఆధ్యాత్మికతలకు అద్దం పడుతూ డివోషనల్ థ్రిల్లర్‌గా మెప్పించింది. చిత్ర హీరో, దర్శకుడు రిషబ్శెట్టికి పాన్ ఇండియ స్థాయిలో తిరుగులేని గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇప్పుడీ చిత్రానికి ‘కాంతార చాప్టర్-1’ పేరుతో ప్రీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాంతారకు ముందు జరిగిన కథ ఇది. హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్నది. ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు సోమవారం మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా మేకింగ్ వీడియోను విడుదల చేశారు. దాదాపు మూడు సంవత్సరాల పాటు 250 వర్కింగ్‌డేస్‌లో షూటింగ్‌ను పూర్తి చేశామని మేకర్స్ తెలిపారు. ఆద్యంతం ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తూ భారీ సెట్స్, విభిన్న ప్రదేశాల్లో చిత్రీకరణకు సంబంధించిన విశేషాలతో మేకింగ్ వీడియో ఆకట్టుకుంది. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.