Kantara Chapter 1 |దర్శకుడు మరియు నటుడు రిషబ్ శెట్టి క్రియేట్ చేసిన సంచలన చిత్రం ‘కాంతార’ (Kantara), దేశవ్యాప్తంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా కి ప్రీక్వెల్‌గా వచ్చిన ‘కాంతార ఛాప్టర్ 1’ కూడా భారీ ఓపెనింగ్స్‌తో దూసుకుపోతోంది. కానీ ఈ సినిమాల విజయం కన్నా వాటిలో చూపిన భూతకోల (Bhoota Kola) ప్రదర్శనపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ‘కాంతార’ సినిమాలోని ‘వరాహా రూపం’ పాటలో రిషబ్ శెట్టి భూతకోల ప్రదర్శన ఇస్తాడు. ఆ నృత్యానికి అద్భుత స్పందన లభించడంతో పాటు, అదే పెర్ఫార్మెన్స్కు అతడికి నేషనల్ అవార్డు కూడా దక్కింది. కానీ ఈ నాట్యరూపాన్ని కొందరు కళారూపంగా చూస్తుంటే, మరికొందరు దైవారాధన ప్రక్రియ గా గౌరవిస్తారు.
నిజానికి భూతకోల అనేది కేవలం నృత్యం మాత్రమే కాదు. ఇది తులు భాషా ప్రజల దైవ నమ్మకాలకు భాగంగా చేసే సంప్రదాయ ఆరాధనా విధానం. భూత అంటే పంచభూతాలు. ఈ భూతకోలలో మూడు ప్రధాన విభాగాలు ఉంటాయి.ప్రకృతి శక్తులు: పంజుర్లి, గుళిగ, మల్లరాయ, జుమాది, చారిత్రక వీరులు : కొరగజ్జ, అణ్ణప్ప, పూర్వీకులు : గ్రామ దేవతలుగా నమ్మబడే వారి ఆరాధన. ఇవి భరతనాట్యం, కూచిపూడి, కథక్ లాంటి నృత్యాలకు భిన్నంగా, కేవలం కర్ణాటక తుళుబెల్ట్ ప్రాంతాల్లో మాత్రమే ప్రదర్శించబడతాయి. ఇతర ప్రాంతాల్లో ప్రదర్శించడం స్థానిక సంప్రదాయాలకు వ్యతిరేకంగా భావిస్తారు.
ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ఓ ఈవెంట్లో భూతకోల ప్రదర్శన ఏర్పాటు చేయడం పై కొన్ని వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇది దైవారాధన కాదని, ఆత్మలను ఆరాధించే తంత్రిక ప్రక్రియ అని వాదనలు వినిపించాయి. ఇది ప్రజల్లో మరింత అపోహలు, అయోమయాన్ని కలిగించాయి. ‘కాంతార’లోని వరాహా రూపం చూసి చాలామంది దీన్ని విష్ణుమూర్తి వరాహ అవతారంగా భావించారు. కానీ కథానుసారం ఇది పంజుర్లి అనే స్థానిక దైవం రూపం. పౌరాణికంగా దీనికి ఒక కథనముంది. పార్వతీదేవి పెంచిన పంది పిల్ల (పంజుర్లి) అల్లరి చేస్తుండటంతో శివుడు దానిని చంపబోయి, చివరికి క్షమించి అడవుల్లో విడిచిపెడతాడు. స్థానికుల నమ్మకం ప్రకారం, అది భూమిని నాశనం చేసే అడవి పందుల నుంచి పంటలను కాపాడుతుంది. అంటే ఇది ఒక గ్రామ దేవత రూపం , విష్ణువుతో సంబంధం లేనిది. ప్రతి ప్రాంతీయ సంప్రదాయానికి ప్రత్యేకత , పూజా విధానం ఉంటుంది. వాటిని పూర్తిగా అర్థం చేసుకోకుండా వైవిధ్యమైన నృత్యాలు, ఆరాధనలు ఒక్కటేనన్న భ్రమ కలగడం వల్లే ఈ రకమైన చర్చలు, విమర్శలు ఎదురవుతున్నాయి.