Kantara Chapter 1 | దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి తెరకెక్కించిన ‘కాంతార చాప్టర్ 1’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధిస్తూ, విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ. 300 కోట్ల క్లబ్‌లోకి చేరింది. అక్టోబర్ 2న దసరా పండుగ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం, తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. హోంబలే ఫిలింస్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం మౌత్ టాక్‌తో అన్ని భాషల్లో హౌస్‌ఫుల్ షోలు నమోదుచేస్తోంది. 7 భాషల్లో, దాదాపు 7000 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మొదటి మూడు రోజుల్లోనే రూ. 235 కోట్లు వసూలు చేసి, చిత్రబృందానికి అమితమైన ఆనందాన్ని అందించింది.
చిత్రబృందం ప్రకారం, నాలుగో రోజున ఇండియాలో ఒక్క రోజే రూ. 61.5 కోట్లు రాబట్టింది. భాషలవారీగా చూసుకుంటే..హిందీ – ₹23.5 కోట్లు, కన్నడ – ₹15.5 కోట్లు, తెలుగు – ₹11.25 కోట్లు, తమిళం – ₹6.5 కోట్లు, మలయాళం – ₹4.75 కోట్లు. ఈ క్రమంలో కేవలం నాలుగు రోజుల్లోనే కాంతార చాప్టర్ 1 మొత్తం కలెక్షన్లు రూ. 300 కోట్ల మార్క్‌ను దాటాయి. ‘కాంతార చాప్టర్ 1’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో విడుదల చేశారు. ఇది ఇప్పటివరకు ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, ‘ఓజీ’, ‘సితారే జమీన్ పర్’ చిత్రాలను దాటేసింది. కేజీఎఫ్ 2 తర్వాత వెయ్యి కోట్ల క్లబ్‌లోకి చేరే అవకాశం ఉన్న తదుపరి కన్నడ సినిమాగా ‘కాంతార చాప్టర్ 1’ నిలవనుంది. సీనియర్ నటుడు జయరాం, హీరోయిన్గా రుక్మిణి వసంత్ నటించిన ఈ సినిమాలో రిషబ్ శెట్టికి ‘డివైన్ స్టార్’ అనే బిరుదును ఫ్యాన్స్ కట్టబెట్టారు.
ప్రముఖ విమర్శకులు, సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ‘కాంతార చాప్టర్ 1’ లాంగ్ రన్లో ఇంకా భారీ వసూళ్లు సాధించే అవకాశముంది. దీపావళి వరకు పెద్ద సినిమాల పోటీ లేకపోవడం కూడా ఈ సినిమాకు అదనపు బలం. ఇక ఈ చిత్రం 1000 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అవుతుందా? అన్నది చూడాల్సిన ఆసక్తికర అంశం.మరోవైపు ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫాం బుక్ మై షోలో ఇప్పటివరకు 50 లక్షల కాంతారా చాప్టర్ 1 టికెట్లు అమ్ముడుపోయాయని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక గత 24 గంటల్లోమిలియన్కుపై టికెట్లు బుకింగ్ అయ్యాయంటే కాంతార మేనియా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.