Kantara Chapter 1 | కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార చాప్టర్ 1’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించిన ఈ పాన్ ఇండియా మూవీని హోంబాలే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. దసరా కానుకగా అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజే రూ. 89 కోట్ల ఓపెనింగ్‌తో దుమ్మురేపింది.కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లోనూ విడుదలైన ఈ సినిమా అన్ని ప్రాంతాల్లో ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందనను పొందుతోంది. ఫోక్ ఎలిమెంట్స్, స్థానిక సంస్కృతి, దేవర భక్తి అంశాలతో మేళవించిన రిషబ్ శెట్టి కథనం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
విడుదలైన మొదటి రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ చిత్రం, కేవలం 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 655 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టింది. అందులో హిందీ వర్షన్ మాత్రమే రూ. 150 కోట్ల మార్క్‌ను దాటడం విశేషం. నార్త్ బెల్ట్‌లో కన్నడ సినిమా ఇంత స్థాయిలో వసూళ్లు సాధించడం అరుదైన విషయం. దేశీయ మార్కెట్లో దూసుకుపోతున్నా, ఓవర్సీస్ మార్కెట్లో మాత్రం వసూళ్లు అంచనాలకు తగ్గట్లుగా లేవు. నిర్మాతలు తెలిపిన వివరాల ప్రకారం, సినిమా ఇప్పటివరకు 4.3 మిలియన్ డాలర్ల వసూళ్లు మాత్రమే సాధించింది. కాగా, ఓవర్సీస్ రైట్స్‌ను 8 మిలియన్ డాలర్లకు విక్రయించినందున, బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా 5 మిలియన్ డాలర్ల రెవెన్యూ అవసరం.
ఈ వారం కొత్తగా నాలుగు సినిమాలు రిలీజ్ అవుతుండటంతో, ‘కాంతార చాప్టర్ 1’ థియేట్రికల్ రన్ ముగింపు దశలోకి వెళ్లే అవకాశం ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ కోసం టికెట్ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించినప్పటికీ, కలెక్షన్లు పెద్దగా పెరగలేదు. అయితే దేశీయ మార్కెట్లో కాంతార ప్రభావం ఇంకా బలంగా కొనసాగుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రిషబ్ శెట్టి నటన, మ్యూజిక్, విజువల్స్, టెక్నికల్ వర్క్‌పై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ విజయోత్సాహంతో హోంబాలే ఫిల్మ్స్ ఇప్పటికే ‘కాంతార చాప్టర్ 2’ కోసం భారీ ప్లాన్ చేస్తోంది. రిషబ్ శెట్టి ఈ ఫ్రాంచైజ్‌ను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.