Kantara 3 | హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందిన కాంతార చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీ సాధించిన విజయంతో ఇప్పుడు కాంతార ప్రీక్వెల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రీక్వెల్ షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అక్టోబర్ 2న సినిమా రిలీజ్ కానుంది. ఈ సమయంలో ‘కాంతార 3’కి సంబంధించిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈసారి కథని మరో లెవెల్‌కు తీసుకు వెళ్లాలనుకుంటున్న రిషబ్ శెట్టి, విభిన్నమైన కథాంశాన్నిఎంచుకున్నట్టు సమాచారం. అంతేకాకుండా ప్రాజెక్ట్‌లోకి తెలుగు స్టార్ హీరోని కూడా తీసుకోవాలని అనుకుంటున్నాడట.
ఇప్పటికే హోంబలే ఫిల్మ్స్ పాన్ ఇండియా లెవెల్‌కి తమ సినిమాలను తీసుకెళ్లడంలో బిజీగా ఉండగా, ‘కాంతార 3’లో ప్రత్యేకమైన కాంబోని సెట్ చేస్తుందనే టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలో కాంతార3లో ఎన్టీఆర్‌ని ఓ కామియో పాత్రకి తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. ఇదే నిజమైతే మాత్రం ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ. అంతేకాదు ఇండియన్ సినిమా స్థాయిలో ఓ బ్లాక్‌బస్టర్ అప్డేట్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. రిషబ్ శెట్టి కథలకు, ఎన్టీఆర్ యాక్షన్, ప్రెజెన్స్‌కు క్రేజీ ఫాలోయింగ్ ఉన్నందున ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరుగుతాయి.
ఇప్పటికే హోంబలే ఫిల్మ్స్ ఎన్టీఆర్‌తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ స్టేజిలోనే ఎన్టీఆర్ పేరు ఫిక్స్ అయిందని, రిషబ్ శెట్టి కూడా తన కథకు ఎన్టీఆర్ అయితే బెస్ట్ అని భావించినట్టు సమాచారం. అతి త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటిస్తారని అంటున్నారు. ఆ మధ్య ఎన్టీఆర్, కర్ణాటక వెళ్లినప్పుడు రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్లతో ఎక్కువ సేపు గడిపాడు.ఏకంగా రిషబ్ శెట్టి ఇంటికి వెళ్లి, వారి ఆతిథ్యం స్వీకరించాడు.. ఆ సమయంలో ఎన్టీఆర్‌కి ‘కాంతార 3’ కథ వినిపించాడని, అందులో 15 నిమిషాల పాటు కనిపించే కీ రోల్ చేసేందుకు ఒప్పించాడని ఇండస్ట్రీ టాక్.