Kannappa | అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మేఘానిలో ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన వెంటనే కొద్ది క్షణాలలోనే కుప్పకూలింది. ప్రమాదం సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. షాహీబాగ్ హోటల్ సమీపంలో విమానం కూలడంతో ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. విమానం కూలిన వెంటనే ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. కిలోమీటర్ల దూరం వరకు ఈ పొగలు కనిపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, ఇతర సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
ప్రమాద ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతోన్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదం జరిగిన విమానంలో మొత్తం 230 మంది ప్రయాణికులతోపాటు 12 మంది విమాన సిబ్బంది ఉన్నట్టు కొందరు చెబుతున్నారు. మరోవైపు ఈ ప్రమాద ఘటన వెనుక కుట్ర ఏమైనా దాగి ఉందా అనే కోణంలో నిఘా వర్గాలు విచారణ జరుపుతోన్నాయి.కుప్పకూలిన విమానం ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 ఫ్లైట్ గా గుర్తించారు. ఈ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళ్తున్నట్టు తెలుస్తుండగా, టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే విమానం కుప్పకూలడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంపై కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన హుటాహుటిన అహ్మదాబాద్‌కి బయలుదేరారు. ఈ విషయంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుజరాత్ సీఎంతో ఫోన్లో మాట్లాడారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. బాధితులకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని, అవసరమైన పూర్తి సహాయం అందిస్తామని ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. అయితే కన్నప్ప జూన్ 27న విడుదల కానుండగా, కొద్ది రోజులుగా జోరుగా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో జూన్ 13 కన్నప్ప సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ప్లాన్ చేసారు. అయితే ప్రస్తుతం కన్నప్ప ట్రైలర్ లాంచ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. విమాన ప్రమాదం కారణంగానే కన్నప్ప ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని వాయిదా వేస్తున్నామని , ట్రైలర్ రిలీజ్ ని ఒకరోజు వాయిదా వేస్తున్నట్టు విష్ణు తెలిపారు. మరణించిన వారికి సంతాపం తెలియజేశారు విష్ణు.