Kannappa | మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పకి అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. కన్నప్ప చిత్రం జూన్ 27న విడుదల కానుండగా, ఈ సినిమాని అడ్డుకుంటామంటూ తాజాగా బ్రాహ్మణ సంఘాలు పిలుపునిచ్చాయి. కన్నప్ప సినిమాలో పిలక గిలక పాత్రపై బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. గుంటూరులో ఇవాళ(శనివారం) కన్నప్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ని అడ్డుకుంటామని బ్రాహ్మణ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.. ఈ మేరకు బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్ ఓ ప్రకటన కూడా విడుదల చేశారు.
మంచు మోహన్ బాబు కుటుంబానికి బ్రాహ్మణులని అవమానించడం అలవాటేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ చాలా సినిమాల్లో బ్రాహ్మణులను కించపరిచిన వారు కన్నప్ప సినిమాలో పిలక గిలక పాత్ర పెట్టారు. ఈ పాత్రపై ఈ రోజు జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పష్టత ఇవ్వకపోతే కోర్టును ఆశ్రయించి సినిమాని అడ్డుకుంటామంటూ హెచ్చరించారు. బ్రాహ్మణులను కించపరిచే విధంగా పాత్రలతో సినిమాలు నిర్మించడం ఇప్పటికైనా మంచు మోహన్‌బాబు కుటుంబం మానుకోవాలంటూ శ్రీధర్ ధ్వజమెత్తారు. దీనిపై చిత్ర యూనిట్ వారు ఆలోచన చేయాలని అన్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో కన్నప్ప నుండి పిలక గిలక అనే హాస్య పాత్రలని పరిచయం చేశారు. ఇందులో బ్రహ్మానందం, సప్తగిరి ఉన్నారు. పోస్టర్లో చేపకు ఈత, పులికి వేట, కోకిలకి పాట… నేర్పిన గురువులు.. అడవికే పాఠాలు చెప్పడానికి వస్తే.. అనే డైలాగ్ కూడా రివీల్ చేశారు. ఇప్పుడు ఇవే తమ మనోభావాలని కించపరుస్తున్నాయంటూ బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి.
ఇక విడుదలకు సిద్ధంగా ఉన్న ‘కన్నప్ప’ మూవీ ఫైనల్ కాపీపై మంచు మోహన్ బాబు, మంచు విష్ణు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఫైనల్ కాపీ సిద్ధం కావడంతో ఆ కాపీని ప్రసాద్ ల్యాబ్స్‌లో మంచు మోహన్ బాబు, విష్ణు వీక్షించారు. ఫైనల్ కాపీ విషయంలో మోహన్ బాబు, విష్ణు సంతృప్తి వ్యక్తం చేసినట్లు మూవీ టీమ్ చెబుతోంది. త్వరలో ట్రైలర్ విడుదల కార్యక్రమం జరగనుండగా, ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ప్రభాస్ కూడా వస్తారనే టాక్ వినిపిస్తోంది. ఏపీలోని భీమవరం గ్రామంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోందని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, కాజల్, అక్షయ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు.